ఆనం అడ్రస్ కొంచెం చెప్పరూ...!

ఆనం వివేకానందరెడ్డి. ఈ పేరు తెలియని వారెవ్వరూ బహుశా ఉండరు. రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీది సపరేటు రూటు. దశాబ్దకాలం నెల్లూరు జిల్లాను శాసించిన ఆనం బ్రదర్స్ రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్ గా ఉండిపోయారు. అధికారంలోకి వచ్చిన టీడీపీలోకి జంప్ చేసినా వీరు అలవాటు పడిన విధంగా రాజకీయాలను శాసించే పరిస్థితి లేదు. అంతా నెల్లూరు నారాయణ, సోమిరెడ్డి హవాయే నడుస్తుంది. ఆత్మకూరు ఇన్ ఛార్జిగా ఆనం రామనారాయణరెడ్డిని నియమించారు. ఆయన తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు.
నెల్లూరుకు దూరంగా....
ఇక ఆనం వివేకానందరెడ్డి మూడు నెలల క్రితం వరకూ ఒక రీతిలో పార్టీలో కన్పించినా ఇప్పుడు కనుమరుగై పోయారు. అస్సలు నెల్లూరుకు రావడానికే ఆనం ఇష్టపడటం లేదు. ఆయన నెల్లూరు వచ్చి దాదాపు మూడు నెలలయిందని చెబుతున్నారు. సంక్రాంతి పండక్కి వస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆనం వివేకా నోరు తెరిస్తే...సెటైర్లు... సూటి విమర్శలే. ముఖ్యంగా టీడీపీలో చేరిన తర్వాత జగన్ పై విరుచుకుపడటం వివేకా అలవాటుగా చేసుకున్నారు. జగన్ పై వ్యక్తిగత విమర్శలకు కూడా వివేకా అనేకసార్లు దిగారు.
మాట చెల్లుబాటు కాకపోవడంతో...
అయితే మూడు నెలల నుంచి ఆనం వివేకా సైలెంట్ కావడానికి అనేక కారణాలు చెబుతున్నారు. తన సోదరుడు రామనారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని బాబు హ్యాండిచ్చారు. మరోవైపు వీఆర్ కళశాల వ్యవహారంలో ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా పనిచేసిందని ఆనం నమ్ముతున్నారు. అధికార పార్టీలో చేరినా తమ మాటకు విలువ లేకుండా పోయిందని వివేకా తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా టీడీపీ కిందిస్థాయి కార్యకర్తలు కూడా ఆనం బ్రదర్స్ ను లెక్క చేయకపోవడంతో తమకు టైమ్ వచ్చినప్పుడు మళ్లీ పాలిటిక్స్ లోకి వద్దామని వివేకా భావిస్తున్నట్లు చెబుతున్నారు.
రామ్ నారాయణరెడ్డికి మాత్రం.....
అందుకే ఆయన హైదరాబాద్ లోనే మూడు నెలల నుంచి ఉంటున్నారు. మీడియాను కలిసేందుకు ఇష్టపడటం లేదు. ఒక్క నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన తన అనుచరులతోనే ఆయన మాట్లాడుతున్నారు. మరోవైపు ఆనం రామనారాయణరెడ్డి మాత్రం పూర్తిస్థాయిలో ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆయనకు టీడీపీ టిక్కెట్ దాదాపుగా ఖరారయినట్లే. అయితే వివేకాకు మాత్రం ఇంతవరకూ టిక్కెట్ పై క్లారిటీ లేదు. దీంతో ఆయన మనస్తాపానికి గురై రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద వివేకా గొంతు విని చాలా రోజులయింది కదూ...!

