ఆధార్ తప్పనిసరిపై కేంద్రం వెనుకడుగు ..?

ఆధార్ నంబర్ ను బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం తప్పనిసరని హుకుం జారీ చేసిన కేంద్రం వెనుకడుగు వేసింది. సుప్రీం కోర్టు లో ఈ అంశంపై విచారణ ముమ్మరమైన నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో ఆధార్ తో బ్యాంక్ అకౌంట్స్ అనుసంధాన ప్రక్రియకు నిర్ణిత గడువు నిర్ణయించలేదు. మొబైల్ ఫోన్ నంబర్లకు మాత్రం ఆయా సెల్యులార్ కంపెనీలకు ఆధార్ నంబర్ తప్పనిసరిగా 6 వ తేదీ లోపు అందించాలని కేంద్రం ప్రకటించింది. బ్యాంక్ ఖాతాల అంశంలో 6 నెలల గడువు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
దేశవ్యాప్తంగా అభ్యంతరాలు ...
బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. పలువురు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. దీనిపై సుప్రీం ధర్మాసనం విచారణ ఆరంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆధార్ ప్రక్రియ నూటికి నూరు శాతం పూర్తి కాకుండా అన్నింటికి ఆధార్ తో లింక్ పెట్టడం తప్పనిసరి చేయడాన్ని అంతా తప్పుపడుతున్నారు. తమ సమాచార గోప్యత పై కూడా అనేకమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో కేంద్రం మొబైల్ తో ఆధార్ అనుసంధానం ప్రక్రియ ఇప్పటికే పలు దఫాలు వాయిదా వేస్తూ వచ్చింది. అలాగే బ్యాంక్ అకౌంట్లతో ఆధార్ లింక్ అంశం గడువు పొడిగిస్తూ కేంద్రం సాగదీస్తుంది. మరోవైపు బ్యాంక్ లలో బినామీ పేర్లతో దాగివుండే నల్లధనం వెలికితీత కు ఆధార్ ఉపయోగపడుతుందని ఐటి విభాగం భావిస్తుంది. ఇప్పటికే ఆధార్ ఆధారంగా అనేకమంది పన్ను ఎగవేత దార్లను గుర్తించి నోటీసులు జారీ చేయడం జరిగిందన్న వాదన ప్రభుత్వ వర్గాల నుంచి వినవస్తుంది.
- Tags
- ఆధార్

