ఆ హీరోను మోడీ పక్కన పెట్టేశాడా..!

బీజేపీ వ్యూహం మార్చుకుంది! ముఖ్యంగా దక్షిణాదిలో బలపడాలని పక్కా స్కెచ్‌తో ముందుకు వెళ్లాలని భావించిన బీజేపీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీకి బలంగా ఉన్న తమిళనాడులో బీజేపీ ఎదగాలని భావించింది. ఈ క్రమంలోనే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు చెప్పడంతో వెంటనే ఆయనను తన చెంతకు చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నిజానికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉండడంతో రజనీ కూడా బీజేపీ వైపు చూస్తారని అందరూ భావించారు. రజనీ రాజకీయాల్లోకి వస్తారని, సంచలనం సృష్టిస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి.
రజనీ కూడా వస్తున్నానని...
వాస్తవానికి రజనీ బీజేపీలో చేరతారన్న వార్తలు గత సాధారణ ఎన్నికల నుంచే వినిపించాయి. సాధారణ ఎన్నికలకు ముందు మోడీ చెన్నై వెళ్లారు. అప్పుడు ఆయన రజనీకాంత్ ఇంటికి వెళ్లడం కూడా రాజకీయంగా ప్రకంపనలు రేపింది. ఇక ఆరేడు నెలలుగా రజనీ పొలిటికల్ ఎంట్రీపై ఒక్కటే వార్తలు వస్తున్నాయి. ఈ మూడేళ్లుగా రజనీపై ఎన్ని వార్తలు వచ్చినా ఆయన ఎప్పుడూ గుంభనంగానే వ్యవహరించారు. గత ఏడాది జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రజనీ రాజకీయ అరంగేట్రం ఖాయమనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ క్రమంలోనే రజనీ కూడా తాను రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నట్టు ప్రకటించారు. అయితే, డేట్ మాత్రం వెల్లడించలేదు. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ నేతలు.. రజనీని తమవైపునకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక ఇప్పుడు డీఎంకే నేతలు నిష్కళంకులుగా 2జీ కేసుల నుంచి బయట పడటం, అదీ సరిగ్గా ఉప ఎన్నికల రోజున తీర్పు రావడం తో పలువురు సామాన్యులు, విశ్లేషకులు, కొందరు రాజకీయ నాయకులు, డీఎంకేకి బిజెపి తో పొత్తు ఖాయమని విశ్లేషించడం మొదలు పెట్టారు.
ఆయన్ను లైట్ గానే తీసుకుని...
కొద్ది రోజుల క్రితమే డీఎంకే లీడర్స్ తో మోడీ ప్రత్యేకంగా భేటీ కావడం, దక్షిణాదిన బలోపేతం కావడానికి బీజేపీ గత కొంత కాలంగా ప్రయత్నిస్తూండటం తో ఈ అనుమానాలకి మరింత ఊతం వస్తోంది. టివి చర్చల్లో పాల్గొంటున్న బీజేపీ నాయకులు సైతం డీఎంకే-బీజేపీ పొత్తు ఊహాగానాల విషయమై ఖండించకపోగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని వ్యాఖ్యానించడం గమనార్హం. వీటన్నింటిని బట్టి చూస్తుంటే, ఒకవేళ బీజేపీ గనక డీఎంకె తో వెళ్ళాలని నిర్ణయించుకుంటే రజనీ ని లైట్ తీసుకోవడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డీఎంకేకి రజనీకి అస్సలు పడే వాతావరణం కూడా కనపించడం లేదు. మరోపక్క, బీజేపీ డీఎంకేకి దగ్గరవుతోంది. ఈ పరిణాలు రజనీకి బీజేపీ దూరంగా జరుగుతోందనే భావనకు బలాన్ని చేకూరుస్తోంది. ఇక, ఇప్పటికీ తన రాజకీయ రంగ ప్రవేశంపై రజనీ కి క్లారిటీ లేకపోవడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

