ఆ సంతోషం ఆవిరై పోయిందే......!

వైసీపీ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యే పది మంది వరకూ ఆ పార్టీతో టచ్ లో ఉంటున్నారు. తాము తిరిగి పార్టీలోకి వస్తామని, పొరపాటు జరిగిపోయిందని వారంతా నేతలకు మొరపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వీరందరితో మాట్లాడుతున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పినట్లు తెలిసింది. అధికార పార్టీ ఉచ్చులో పడి వెళ్లామని, కాని అక్కడ రాజకీయ భవిష్యత్ లేదని తేలిందని కొందరు వెనక్కు వచ్చేయాలని చూస్తున్నారని వైసీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే ఇది వైసీపీ మైండ్ గేమ్ లో భాగమేనని టీడీపీ నేతలు చెబుతున్నా వైసీపీ నేతలు మాత్రం ఇది వాస్తవమని గట్టిగా చెబుతున్నారు.
అందుకే విజయసాయి ఆరోపణలా?
పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు కొందరు ఇచ్చిన సమాచారం మేరకే విజయసాయి రెడ్డి ఐఏఎస్ లపై ఆరోపణలు చేశారని తెలుస్తోంది. తాము పార్టీలో చేరే ముందు తమతో ఎవరెవరు సంప్రదించింది? ఎలాంటి హామీలు ఇచ్చిందీ వారు చెప్పడంతోనే విజయసాయి బహిరంగంగా ఈ ఆరోపణలు చేశారంటున్నారు. అయితే వీరిని పార్టీలోకి తిరిగి చేర్చుకోవాలని వైసీపీలో కొందరు అభిప్రాయపడుతుండగా మరికొందరు చేర్చుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని అంటున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన తర్వాత అధికార పార్టీలో అంత సంతోషంగా లేరన్నది ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
కొందరు స్వతంత్రంగా పోటీ చేయాలని.....
అయితే పార్టీ మారిన కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్నప్పటికీ తిరిగి వైసీపీలోకి రాలేక వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. వైసీపీలోకి తిరిగి వెళ్లినా అంత గౌరవం లభించందని తెలిసి తమ సొంత బలంతోనే గెలిచేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషాలు ఈ కేటగిరీలోకే వస్తారంటున్నారు. ఇటీవల వైసీపీని వీడిన గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి లు కూడా అంత సంతోషంగా లేరని చెబుతున్నారు. ఇటీవల కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. మొత్తం మీద వైసీపీ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము తప్పు చేశామంటూ పశ్చాత్తాప పడుతుండటం, విజయసాయి రెడ్డికి టచ్ లో ఉండటంతో ఎప్పుడు ఏదైనా జరిగే అవకాశముందన్నది సుస్పష్టం.
- Tags
- వైసీపీ

