ఆ రెండు గదుల్లోనే అంతా...!

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆ రెండు గదుల్లో ఏముంది? ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగలు, నగదు ఉన్నాయా? ఇవే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ బయలుదేరాయి. సంక్రాంతి నాటికి జయలలిత నివసించిన పోయెస్ గార్డెన్ ను అమ్మ స్మారక మందిరంగా తీర్చి దిద్దాలన్నది ముఖ్యమంత్రి పళనిస్వామి లక్ష్యం. జయ నివాసమైన పోయెస్ గార్డెన్ ను స్మారకమందిరంగా చేసి అందరికీ చూసే అవకాశం కల్పించాలన్న యోచనలో పళని ఉన్నారు. ఈమేరకు రెవెన్యూ, ఐటీ అధికారులను ఆదేశించారు. అయితే ఆ రెండు గదుల్లో రెండు ల్యాప్ ట్యాప్ లు, నగలు, విలువైన వస్తువులు ఉన్నాయని సమాచారం.
స్మారక మందిరంగా చేసేందుకు....
ఈ నేపథ్యంలో శనివారం జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్ కు ఆదాయపుపన్ను శాఖ, రెవెన్యు శాఖ అధికారులు వచ్చారు. గతంలో పోయెస్ గార్డెన్ లో ఐటీ దాడులు జరిగాయి. అయితే అప్పట్లో జయలలితకు చెందిన రెండు గదులను మాత్రం తనిఖీ చేయలేదు. వీటిని అప్పట్లో సీజ్ చేశారు. వీటిని తెరిచి అందులో వస్తువులను స్వాధీన పర్చుకుంటే గాని స్మారక మందిరంగా మార్చలేరు. అందుకే ఈరోజు ఆ గదులను పరిశీలించి స్మారక మందిరంగా మార్చేందుకు సిద్ధం చేయాలని అధికారులు భావించారు. అయితే శశికళ అనుచరులు దీనికి అభ్యంతరం తెలిపారు. ఆ గదులను తెరవకూడదని అధికారులను శశి అనుచరులు అడ్డుకున్నారు.
ఇక జన నివాసం....
అయితే పోలీసులు వీరిని సమర్థంగా తిప్పికొట్టారు. పోయెస్ గెర్డెన్ ను పోలీసులు తమ స్వాధీనం లోకి తీసుకున్నారు. దీంతో ఆ రెండు గదులను కూడా తెరిచి అందులో ఉన్న వస్తువులను తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేయనున్నారు అధికారులు. సంక్రాంతి పండుగ నుంచి జయ స్మారక మందిరం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పోయెస్ గార్డెన్ పై పట్టు కోల్పోతే శశికశ పూర్తిగా ఇబ్బంది పడుతున్నదన్నది పళని స్వామి ఆలోచన కూడా. పన్నీర్ సెల్వం కూడా తాను తిరిగి పార్టీలోకి చేరేటప్పుడు పోయెస్ గార్డెన్ ను స్మారక మందిరంగా చేయాలని షరతు విధించారు. పోయెస్ గార్డెన్ లోఉన్న చిన్నమ్మ కుటుంబ సభ్యులను కూడా బయటకు గతంలోనే పంపించి వేశారు. అక్కడ కేవలం కాపలాదార్లు మత్రమే ఉన్నారు. చిన్నమ్మ జైలు నుంచి తిరిగి వచ్చేసరికి జయ నివాసం...జన నివాసంగా మారబోతోందన్నమాట.
- Tags
- పోయెస్ గార్డెన్

