ఆ రకంగా భేషైన ఏర్పాటు చేస్తున్నారు!

జనానికి నోట్ల పరంగా ఎదురవుతున్న ఇబ్బందుల్లో బ్యాంకుల్లో నోట్ల లభ్యత లేకపోవడం అనేది ఒక కీలకమైన అంశం. కొన్ని బ్యాంకుల్లో ప్రజలకు ఇవ్వడానికి సరిపడా నోట్లు ఉంటున్నాయి. కొన్ని బ్యాంకుల్లో అసలు అందుబాటులో ఉండడం లేదు. దీనివల్ల ప్రజలకు రకరకాల కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే ఇలాంటి అసమానతలు వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా చంద్రబాబునాయుడు సర్కారు కొత్త నిర్ణయం చేసింది.
జిల్లాల్లో చెస్ట్ బ్యాంకులు అంటూ నగదు పంపిణీ చేసే బ్యాంకులు ఉంటాయి. నగదు అక్కడినుంచే జిల్లాలోని అన్ని బ్యాంకు శాఖలకు పంపిణీ అవుతూ ఉంటుంది. ఏ బ్యాంకు కు చెందిన చెస్ట్ బ్యాంకు ఉంటే.. ఆ బ్యాంకు శాఖలకు మాత్రమే వారు డబ్బు పంపించుకుంటారు. అంటే ఒక బ్యాంకు దగ్గర డబ్బులుంటే.. మిగిలిన వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.
ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబునాయుడు బ్యాంకర్లతో ప్రత్యేకంగా తాను ఒక సమావేశం పెట్టుకుని ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. చెస్ట్ బ్యాంకు ఏ బ్యాంకు సంబంధించినది అయినా.. తమ వద్ద ఉన్న డబ్బును అన్ని బ్యాంకుల శాఖలకు పంపిణీ చేసి.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన సూచించారు. దీనికి బ్యాంకర్లు కూడా అంగీకరించడంతో.. క్షేత్రస్థాయిలో నగదు కొరత రూపేణా ప్రజలకు ఎదురు కాగల ఒక పెద్ద ఇబ్బంది తీరినట్లు అయింది.

