ఆ మూడింటి కోసమే బాబు ఈ హడావిడా?

తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో తన వ్యూహాన్ని అమలుపర్చనుందా? తెలుగుదేశం అధినేత ఎందుకు తగ్గారు? పార్లమెంటరీ సమావేశం జరుగుతున్నప్పుడే జాతీయ మీడియాలో బీజేపీ, టీడీపీ పొత్తు విచ్ఛిన్నమయ్యాయన్న కథనాలు కూడా వచ్చాయి. అలాగే శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడరని కూడా కథనాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత చంద్రబాబు తాను ఉద్ధవ్ తో మాట్లాడలేదని చెప్పారు. కాని హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ మాత్రం చంద్రబాబుకు ఫోన్ చేసి తొందరపడవద్దని కోరారు. అయితే చంద్రబాబు మాత్రం తొందరపడే ఉద్దేశం తనకు లేదని, నాలుగేళ్ల నుంచి ఎదురుచూపులే మిగిలాయని, హామీలు అమలు పర్చకపోవడం వల్లనే బాధపడాల్సి వస్తుందని రాజ్ నాధ్ తో చంద్రబాబు అన్నారు.
నేడు బీజేపీ హైకమాండ్ వద్ద పంచాయతీ.....
అయితే ఈరోజు తెలుగుదేశం ప్రతినిధి బృందం బీజేపీ అధిష్టానాన్ని కలిసి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలుపుతుంది. రాష్ట్రానికి ఇంకా ఏమేం హామీలు అమలు జరగాలి? నిధుల కేటాయింపు ఈ నాలుగేళ్లలో ఎలా జరిగింది? ఆంధ్రప్రదేశ్ ఎలా నష్టపోయిందీ టీడీపీ నేతలు బీజేపీ అధిష్టానానికి వివరిస్తారు. తమ అధినేత ఆవేదనను కూడా వారికి తెలియజేస్తారు. వారి నుంచి స్పష్టమైన హామీ లభిస్తే సరి. లేకుంటే మంగళవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో తమ నిరసనను తెలియజేస్తామని బీజేపీ అధిష్టానానికి తెలియజేస్తారు. ఇందుకు బీజేపీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందీ అధినేత చంద్రబాబుకు వివరిస్తారు.
అసెంబ్లీ సీట్ల పెంచాలన్నదే.....
ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక ప్యాకేజీ నిధులు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై ప్రతినిధి బృందం బీజేపీ అధిష్టానంతో ఈరోజు చర్చించే అవకాశముంది. విశాఖ రైల్వే జోన్ ఆ ప్రాంత వాసులకు సెంటిమెంట్ కావడంతో దానిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లలేమని తెగేసి చెప్పనున్నారు. ఇక నియోజకవర్గాల పెంపుపై కూడా గట్టిగా చెప్పనున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో పెంపు బిల్లును పెట్టాలన్నది టీడీపీ ప్రధాన డిమాండ్ గా ఉంది. నియోజకవర్గాల పెంపు జరగకుంటే టీడీపీకి చాలా సమస్యలు తలెత్తే అవకాశముంది. ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలు, అప్పటికే ఉన్న టీడీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తి దాని ప్రభావం ఫలితాలపై పడతుందన్న ఆందోళన టీడీపీలో ఉంది. ఇక ప్రత్యేక ప్యాకేజీకి తాము అంగీకరించామని, ఆ నిధులు విడుదల చేయకుంటే విపక్షాలకు, ప్రజలకు ఏం సమాధానం చెబుతామని కూడా బీజేపీ పెద్దలను ప్రశ్నించనున్నారు. ఈరోజు బీజేపీ అగ్రనేతల నుంచి వచ్చే హామీ మేరకే ఆందోళన ఉంటుందన్నది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మూడు హామీలను అమలు చేస్తే టీడీపీ సంతృప్తి పడే అవకాశముంది. అందుకే చంద్రబాబు ఇంత హడావిడి చేస్తున్నారన్నది పార్టీ వర్గాల నుంచే విన్పిస్తున్న మాట.
- Tags
- చంద్రబాబు

