ఆ ముగ్గురు ఎమ్యెల్సీలకు ఇక భవిష్యత్తు లేదా ...?

చంద్రబాబు పూర్తి ఎన్నికల మూడ్ లోకి వచ్చేశారు. ఆయన రావడమే కాదు క్యాడర్ ను రప్పించే పనిలో పడ్డారు. పచ్చ పార్టీకి నష్టం తెచ్చేవారిని ఉపేక్షించడం వల్ల తప్పుడు సంకేతాలు పోయే ప్రమాదాన్ని గుర్తించారు. దాంతో ఎవరివల్ల చేటు వస్తుందో వారిపైనే జంకు గొంకు లేకుండా పార్టీలో ఉంటే వుండండి పోతే పోండి అనే తీరులోనే కఠిన వైఖరే ప్రారంభించారు. పార్టీకి తీవ్ర డ్యామేజ్ తెస్తున్నారని గుర్తించిన ముగ్గురు ఎమ్యెల్సీలపై నేరుగా టిడిపి వర్క్ షాప్ లో అందరిముందే ఫైర్ అయ్యారు.
పది ఓట్లు తెస్తారని పదవులు ఇస్తే...
కొందరు ఎమ్యెల్సీ లు తమ తమ నియోజకవర్గాల్లో చక్రం తిప్పాలని ఎమ్యెల్యేల పనుల్లో జోక్యం చేసుకుంటున్నారు. పార్టీ కోసం పనిచేశారని పదవులు ఇచ్చి పది ఓట్లు తెస్తారని భావిస్తే వచ్చే ఓట్లు కూడా పోగొట్టేలా ప్రజల్లో టిడిపిని బద్నాం చేస్తున్నారు. వీరిని ఉపేక్షించేది లేదు. కొనసాగించేది లేదు. వారికి భవిష్యత్తు లేకుండా చేస్తా. ఎవరెవరు ఏ నియోజకవర్గాల్లో ఏమి చేస్తున్నారనేది రిపోర్ట్ అంతా నా దగ్గర వుంది. సమయం వచ్చినప్పుడు సంగతి తెలుస్తా అని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
ఆ ముగ్గురు వీరేనా ...?
గత కొంత కాలంగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో కరణం బలరాం వెర్సెస్ గొట్టిపాటి రవి కుమార్ నడుమ బాహా బాహీ నడుస్తుంది. అలాగే రాయలసీమలో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిల మధ్య వార్ కొనసాగుతోంది. చీరాలలో పోతుల సునీతా ల వ్యవహారాలతో టిడిపి కోల్డ్ వార్ కాస్తా వీధికెక్కింది. ఆయా వర్గాలను సముదాయించి దారికి తేవడానికి అధిష్టానానికి తల ప్రాణం తోకకు వచ్చేలా చేస్తుంది. మీడియా లో అల్లరి అల్లరి అవుతుంది. ఇవన్నీ ఇప్పటివరకు భరించిన చంద్రబాబు ఎన్నికల ఏడాది అయినా కంట్రోల్ చేయకపోతే ఇక రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా వున్న చోట పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించారు. తనకు పార్టీ ముఖ్యమని వ్యక్తులు కాదని గొట్టిపాటి వంటి వారిని వైసిపి నుంచి చేర్చుకోవడం వెనుక పార్టీ బలోపేతమనే స్లోగన్ మొదలు పెట్టారు చంద్రబాబు. అత్యంత సమస్యగా మారిన నియోజక వర్గాల్లో పరిస్థితి సర్దుబాటు చేస్తే టిడిపిలోకి వలసవచ్చిన వైసిపి నేతలు వున్న చోట వ్యవహారం పరిష్కారం చేయొచ్చనేది తెలుగుదేశం అధినేత ఆలోచనగా విశ్లేషకులు భావిస్తున్నారు.
- Tags
- టీడీపీ

