ఆ టీడీపీ ఎమ్మెల్యే ఫోన్ ఎత్తడం లేదా...?

రాజధాని జిల్లా కృష్ణాలో అధికార పార్టీలో కుమ్ములాటలు, అసంతృప్తులు రోజుకోవిధంగా వీధిన పడుతున్నాయి. సాక్షాత్తు ఎమ్మెల్యేనే తమను పట్టించుకోవడం లేదని సీనియర్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నగారు ఎన్టీఆర్ పుట్టిన జిల్లాలో పార్టీ భవిత ప్రశ్నార్థకంగా మారిందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం నుంచి 2014లో గెలుపొందిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వైఖరిపై సొంత పార్టీ స్థానిక కేడర్ నిప్పులు చెరుగుతోంది. బోడే ను గెలిపించేందుకు తాము నిద్రాహారాలు మానుకుని కష్టపడ్డామని, ఆయన కోసం ఎన్నో త్యాగాలు చేశామని, ఇప్పుడు ఆయన తమను కనీసం కన్నెత్తి చూడడం లేదు. పన్నెత్తి పలకరించడం లేదని గగ్గోలు పెడుతోంది.
ఫోన్ ఎత్తక పోవడంతో....
ఇటీవల అన్నగారి వర్థంతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఈ క్రమంలోనే పెనమలూరు నియోజకర్గం పరిధిలో టీడీపీకి బలమైన కేంద్రంగా ఉన్న కానూరులోనూ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే, బోడే ప్రసాద్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు స్థానిక నేతలు ఎంతో ప్రయత్నించారు. కానీ, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోగా.. తాను హైదరాబాద్ వెళ్తున్నానని, వచ్చే సరికి లేటవుతుందని తర్వాత కలుద్దామని నేతలకు కబురు పెట్టారు. దీంతో వారంతా స్థానికంగా కార్యక్రమం నిర్వహించారు. ఇక, ఈ క్రమంలోనే స్థానిక నేతల్లో కొందరు.. ఎవరికివారే అన్నగారి వర్థంతి కార్యక్రమం నిర్వహించుకున్నారు. అయితే, ఇక్కడే వీరి మధ్యవిభేదాలు రచ్చకెక్కాయి.
ఒకరిపై ఒకరు కారాలు...మిరియాలు...
కానూరులో టీడీపీ గ్రామ అధ్యక్షుడు దోనేపూడి రవికిరణ్ అధ్యక్షతన కార్యక్రమాలు చేపట్టారు. సనత్‌నగర్‌లో రవి, రామాలయం వద్ద వెలగపూడి శంకరబాబు వర్ధంతి కార్యక్రమాలు చేశారు. ఈ టెంట్‌కు పక్కనే టీడీపీ మండల కార్యదర్శి షేక్ బుజ్జి, సేవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి రవితో పాటు ఆయతో ఉన్న వారు రావాలని దుర్గగుడి పాలక మండలి సభ్యుడు, సీనియర్ టీడీపీ నేత శంకరబాబు కోరగా, తమకు చెప్పకుండా కార్యక్రమం పెట్టడమేమిటని రవి ప్రశ్నించాడు. దీంతో అక్కడే ఉన్న షేక్ బుజ్జీ స్పందించి పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పదేళ్లు పోరాటం చేశామని, ఇప్పుడు పార్టీలోకి వచ్చి తమకు చెబుతారా అని వీరంగం వేశాడు. ఈ వివాదం ముదిరి పాకాన పడింది. నేతలు టెంట్లు పీకేసి ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకునే వరకు వెళ్లింది.
ఎమ్మెల్యేపై ఆగ్రహం....
ఇక, ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్.. నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పెదఓగిరాలకు చెందిన పిచ్చిరెడ్డి ఈ సందర్భంగా బోడేపై విరుచుకుపడ్డాడు. ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే తీయటం లేదని, గుర్తింపు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోకి వస్తే కనీస సమాచారం ఉండటం లేదని కార్యకర్తలకు ఏమి సమాధానం చెప్పాలని నిలదీశారు. శంకరబాబు మాట్లాడుతూ కానూరులో పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి కానూరు మాజీ సర్పంచి అన్నే వేణుగోపాలకృష్ణమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.
కష్టపడ్డ వారికి కాకుండా....
గ్రామం ఎవరి సొత్తుకాదని, తాము 4 వేల సభ్యత్వాలు చేయించామని, ఎవరికి చేతైతే వారు చూసుకోవటమేనని అన్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం కూడా రసాభాసగా మారింది. దీనంతటికీ ఎమ్మెల్యే వైఖరే కారణమని, తన గెలుపుకోసం కృషి చేసిన వారిని వదిలేసి.. సంచులు అందించేవారికి చెంచాలాగా మారిపోయాడని పెద్ద ఎత్తున విమర్శించారు. ఈ పరిణామం చంద్రబాబు దాకా వెళ్తే.. పరిస్థితి సీరియస్ అవుతుందని గ్రహించిన ఎమ్మెల్యే అప్పటికి సర్దు బాటు చేసి పంపేశారు. అయితే, ఈ పరిణామం వచ్చే ఎన్నికల నాటికి మరింత తీవ్రం అవుతుందని అంటున్నారు పరిశీలకులు.
- Tags
- టీడీపీ

