ఆ ఎన్నికలు తప్పవా?...వేగంగా సర్కార్

ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ తో మళ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయా? గవర్నర్ ప్రసంగం సందర్భంగా తెలంగాణ శాసనసభలో చోటు చేసుకుకున్న పరిణామాలను టీఆర్ఎస్ సర్కార్ సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలంపూర్ శాసనసభ్యుడు సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాలను రద్దు చేసిన విషయమూ విదితమే. అయితే మంగళవారం రాత్రే శాసనసభ్యత్వాల రద్దుకు సంబంధించి గజెట్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. అంటే ప్రభుత్వం ఏమాత్రం వీరిద్దరి విషయంలో పునరాలోచించే పరిస్థితి లేదని తెలుస్తోంది.
చాలా వేగంగా.....
స్పీకర్ తనకున్న విశేష అధికారాలతో శాసనసభ్యత్వాలను రద్దు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకూ ఇలాంటి సంఘటన జరగలేదు. ఇద్దరు శాసనసభ్యుల సభ్యత్వ రద్దు విషయం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫ్యాక్స్ ద్వారా సమాచారం పంపింది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఈ ఇద్దరి శాసనసభ్యుల విషయంలో చాలా వేగంగా వ్యవహరించిందన్నది అర్థమవుతుంది. ఈసీ పరిశీలించి ఈ రెండు స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటించే అవకాశముంది.
గెజిట్ నోటిఫికేషన్ విడుదల....
అయితే గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు కాబట్టి, ప్రభుత్వం తిరిగి పునరాలోచిస్తుందని చాలామంది అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కావడంతో స్పీకర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారని కూడా భావించారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాని అటువంటి ఏవీ లేకుండా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇక ఈ రెండు శాసనసభ స్థానాలు ఖాళీ అయినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయించినా.....
కాని దీనిపై ఈరోజు కాంగ్రెస్ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. తమ శాసనసభ్యత్వాలను అకారణంగా రద్దు చేశారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లు ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. అయితే స్పీకర్ కు ఆర్టికల్ 194(3) ద్వారా సంక్రమించిన అధికారాన్ని న్యాయస్థానాలు కూడా ప్రశ్నించలేవన్నది నిపుణుల అభిప్రాయం. న్యాయస్తానానికి వెళ్లినప్పటికీ స్పీకర్ ఆదేశాలపై వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు.
మరో ఇద్దరిపైన....మరికాసేపట్లో....
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లతో పాటు మరో ఇద్దరి పైన కూడా ప్రభుత్వం చర్యలకు దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. మంగళవారం రాత్రి మరోసారి సీసీటీవీ వీడియో ఫుటేజీని మంత్రులు న్యాయనిపుణులతో కలిసి పరిశీలించారు. ఈ సంఘటనలో మరో ఇద్దరు కూడా పాల్గొన్నారని ఆ ఫుటేజీ ద్వారా అర్థమయింది. ఈ విషయం మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి మంత్రులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వారెవరనేది తెలియడం లేదు. అందిన సమాచారం మేరకు వంశీచందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి. వీరిలో ఇద్దరిపై మరికాసేపట్లో చర్యలు తీసుకునే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు ఎన్నికలకు ఏడాది ముందే హీటెక్కాయి.
