ఆ ఇద్దరు మాజీ మంత్రులు టీడీపీలోకే..!

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌కు కొద్ది రోజులుగా బ్రేక్ పడింది. ప్రభుత్వం వరుసగా పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజల్లో ఆదరణ కోసం ప్రయత్నాలు చేస్తుంటే, చంద్రబాబు విదేశీ పర్యటనలతో ఏపీకి పెట్టుబడులు రప్పించేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్ ప్రజాసంకల్ప యాత్రతో సీమ జిల్లాల్లో తన యాత్ర ముగించుకుని కోస్తాలోకి ఎంటర్ అవుతున్నారు. ఇక ఎన్నికలకు మరో యేడాది టైం మాత్రమే ఉండడంతో మరోసారి ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేచినట్టే కనపడుతోంది.
ఈ మాజీ మంత్రులిద్దరూ....
ఏపీలో గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఓ వెలుగు వెలిగిన కొందరు మాజీ మంత్రులు ఇప్పుడు కాంగ్రెస్‌లో పట్టించుకునే వాళ్లు లేక రాజకీయంగా పని పాటా లేకుండా ఖాళీగా ఉంటున్నారు. వీరంతా వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ ఫామ్‌లో ఉన్న పార్టీలో చేరి రాజకీయంగా యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారు. ఈ లిస్టులోనే గత కాంగ్రెస్ పాలనలో మంత్రులుగా చేసిన ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు కూడా ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. వీరిద్దరి చూపులు అధికార టీడీపీ వైపు ఉన్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కోండ్రు మురళీ ఇద్దరూ టీడీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజాం నియోజకవర్గంలో మురళీ అయితే బలమైన అభ్యర్థి అవుతాడన్న భావన టీడీపీ అధిష్టానంలోనే ఉంది. అక్కడ ప్రతిభా భారతికి నామినేటెడ్ పదవి ఇచ్చి మురళీని వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నారు.
సరైన సమయం కోసం....
ఇక కర్నూలు జిల్లాలో బలమైన రాజకీయ ఫ్యామిలీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నా ఆ పార్టీకి ఏపీలో ఫ్యూచర్ లేదని డిసైడ్ అవ్వడంతో కోట్ల ఫ్యామిలీ కొద్ది రోజులుగా టీడీపీలోకి వెళదామని కోట్లపై ఒత్తిడి చేస్తోందట. కోట్ల భార్య, మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మతో పాటు వీళ్ల తనయుడు రాఘవేందర్‌రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నా కోట్ల మాత్రం సరైన టైం కావాలంటూ నాన్చుతున్నారని కర్నూలు జిల్లాలో చర్చలు నడుస్తున్నాయి. కోట్ల టీడీపీలోకి వస్తే ఆ ఫ్యామిలీకి ఎంపీ సీటుతో పాటు ఓ అసెంబ్లీ సీటు ఇస్తామని టీడీపీ నుంచి ప్రతిపాదనలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక కోట్ల తనయుడు రాఘవేందర్‌రెడ్డి, చంద్రబాబు తనయుడు లోకేష్ సన్నిహితులు కావడంతో లోకేష్ కూడా కోట్ల ఫ్యామిలీని టీడీపీలోకి రావాలని కోరుతున్నాడు. మరి త్వరలోనే ఈ ఇద్దరు మాజీ మంత్రులు పసుపు కండువా కప్పుకునే అంశంపై క్లారిటీ రానుంది.

