ఆ ఇద్దరినీ... జగన్ ఎదుర్కోవాలంటే...?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇలాకాలో జగన్ తన సత్తా చాటేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఈసారి వీరిద్దరినీ ఎదుర్కొనాల్సి ఉంటుంది జగన్. ఒకరు ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా, మరొకరు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం కూడా టీడీపీలో చేరింది. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరకపోయినా ఆయన పరోక్షంగా మద్దతు టీడీపీకే లభిస్తుందన్నది జగద్వితం.
మాజీ సీఎం, ప్రస్తుత సీఎం....
వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో వైసీపీకి చోటు లేకుండా చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు తనకు బద్ధశత్రువైన నల్లారి కుటుంబాన్ని పార్టీ లో చేర్చుకున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఈ ఇద్దరి నేతల వ్యూహాలను జగన్ ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే వీరిద్దరూ ఊహించని విధంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర సూపర్ సక్సెస్ అవుతూ వస్తుంది. తంబళ్లపల్లిలో నిర్వహించిన బహిరంగ సభకు ఊహించని విధంగా ప్రజలు హాజరయ్యారు.
తంబళ్లపల్లిలో నేత లేకున్నా....
వాస్తవానికి తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో అక్కడ పార్టీకి ఎవరూ లేరని భావించినా ఊహించని విధంగా సభ సక్సెస్ కావడంతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జగన్ కు వ్యతిరేకంగా పావులు కదిపిన సంగతి తెలిసిందే. జగన్ పార్టీని వీడటానికి కూడా కారణం ఒకరకంగా కిరణ్ అని పార్టీలో చెప్పుకుంటుంటారు. జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో ప్రవేశించగానే హైదరాబాద్ లో ఉన్న నల్లారి కిరణ్ ఆరా తీయడం విశేషం. అయితే పాదయాత్రను వైసీపీ నేతలు మిధున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరుండి సక్సెస్ అయ్యేలా చూస్తున్నారు.
టీడీపీ నుంచి కొందరు పార్టీలో చేరేందుకు....
ఇక రానున్న కాలంలో జగన్ పర్యటించే నియోజకవర్గాలు కూడా కీలకమే. దీంతో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇలాకాలో ఎలాగైనా పట్టు పెంచుకోవాలని చూస్తున్న జగన్ పార్టీ అందుకోసం కొన్ని వ్యూహాలను కూడా ముందుగానే రచించింది. పలమనేరు, పీలేరు నియోజకవర్గాల్లో కొందరు టీడీపీ నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉండటంతో ఆ నియోజకవర్గంలో ప్రవేశించగానే టీడీపీ నేతలకు వైసీపీ కండువా కప్పేందుకు సిద్ధమయ్యారట. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో జగన్ పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ నేతలు ఆ ఆమేరకు కార్యాచరణను కూడా సిద్ధం చేసుకున్నారు.
- Tags
- జగన్

