అసలు నిజం ఏంటి..?

అసలు నిజం ఏంటి ? కేంద్రం చెబుతున్నదానికి రాష్ట్రం చెబుతున్న లెక్కలకు పొంతన లేదే ? ఎవరు చెప్పేది నిజం? ఎవరు చెప్పేది అబద్ధం? ప్రజలకు తెలియచెప్పేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి వేశారు. ఆ కమిటీలో లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ లు అందరికి తెలిసిన వారు కాగా రిటైర్డ్ ఐఏఎస్ పద్మనాభం, ఐవైఆర్ కృష్ణా రావు, తోట చంద్రశేఖర్ సత్యాన్వేషణ కమిటీ సభ్యులు. వీరు లెక్కలన్నీ చూసి ఏపీకి కేంద్రం నుంచి ఇంకా 75 వేలకోట్ల రూపాయలు రావాలంటూ తేల్చారు. ఇక్కడితో వాస్తవానికి ఈ కమిటీ బాధ్యత పూర్తి అయ్యింది. దీనిపై కేంద్రానికి కమిటీ లేఖ రాసింది. కమిటీ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తప్పులు స్పష్టం అయ్యాయి. నిజాలు ఇన్నేళ్లు ఎందుకు దాచిపెట్టారన్న వాదన బయల్దేరింది. పోలవరం తదితర కీలక అంశాల జోలికి కమిటీ వెళ్ళకపోవడం జయప్రకాశ్ నారాయణ టిడిపి సర్కార్ కి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిపోయాయి.
పవన్ జె ఎఫ్ సి నుంచి యూటర్న్ తీసుకున్న జెపి ...
సత్యమేవ జయతే అంటూ పవన్ ఏర్పాటు చేసిన జె ఎఫ్ సి లో కీలక వ్యక్తి డాక్టర్ జయప్రకాశ్ జనసేనానిపై విమర్శలు గుప్పించారు. పవన్ చిత్తశుద్ధిని ఆయన ప్రశ్నించారు. జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ చేసిన సూచనలు ముందుకు తీసుకువెళ్లడంలో పవన్ విఫలం అయ్యారంటూ జెపి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆయన ఆగలేదు. తాను మరొకమిటీ వేసి నిజం తెలుస్తా అన్నారు. పవన్ జె ఎఫ్ సి నివేదిక ఇచ్చాకా గుంటూరు సభలో టిడిపి సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఆ విధంగా టిడిపి పై పవన్ యూటర్న్ తీసుకుంటారని జెపి అంచనా వేయలేక పోయారు. గత కొంతకాలంగా టిడిపి సర్కార్ పై జెపి సానుకూల వైఖరే అవలంబిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి తప్పులని ఆయన ఎత్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
స్వాగతించిన జనసేన, సిపిఐ ....
డాక్టర్ జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖలపై జనసేన అధినేత ఆచితూచి స్పందించారు. మరో కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. అదే రీతిలో సిపిఐ కూడా స్పందించింది. జెపి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. కేంద్రంపై పోరాటానికి జె ఎఫ్ సి సూచనలను ప్రజల్లోకి తీసుకువెళతామని కూడా రామకృష్ణ పేర్కొనడం విశేషం. మొత్తానికి ఏపీలో రాజకీయ వేడి అంతకంతకు పెరుగుతూ పొలిటికల్ డ్రామా రసవత్తరంగా నడవటం విశేషం.
