అశ్విన్ అద్భుతం : కివీస్‌ను వైట్‌వాష్ చేసిన భారత్

ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఓ అద్భుతం నమోదు అయింది. ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉండగానే.. కివీస్ జట్టును చాపచుట్టినట్టుగా చుట్టబెట్టేశారు. మూడో టెస్టులో మొదటిరెండు టెస్టులకంటె అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. వైట్‌వాష్ చేశారు. రవిచంద్ర అశ్విన్ మణికట్టు మాయాజాలం ముందు కివీస్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయారు. కేవలం 153 పరుగులకే కివీస్ రెండో ఇన్నింగ్స్ ప్రస్థానపు పతనాన్ని అశ్విన్ శాసించడంతో.. కనీసం ఒక్కటెస్టు డ్రా చేసి అయినా పరువు దక్కించుకుందామనుకున్న కివీస్‌కు భంగపాటు తప్పలేదు.
మూడోరోజు కివీస్ ను ఫాలో ఆన్ ఆడనివ్వకుండా తామే బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు సెకండిన్నింగ్స్ లో 299 పరుగులు చేసి అక్కడికి డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన కివీస్ జట్టు ఆద్యంతం రవిచంద్ర అశ్విన్ దాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. మొదటి ఇన్నింగ్స్ లో రెండు రనౌట్ లకు అదనంగా ఆరు వికెట్లు తీసిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్ లో ఒక అడుగు ముందుకు వేసి.. ఏకంగా ఏడు వికెట్లు తీసాడు.
భారత్ రెండో ఇన్నింగ్స్ చాలా ఘనంగానే ప్రారంభం అయింది. మొదటి ఇన్నింగ్స్ లో కొహ్లి డబుల్ సెంచరీ, రహానే సెంచరీ చేయగా, రెండో ఇన్నింగ్స్ లో ఆ సెంచరీ బాధ్యతను పుజారా తీసుకున్నాడు. అవుట్ కాకుండా 101 పరుగులు చేశాడు. చాలాకాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని నిన్న గాయం కారణంగా వాడుకోలేకపోయిన గంభీర్ ఇవాళ క్రీజులోకి వచ్చి హాఫ్ సెంచరీతో గౌరవప్రదమైన స్కోరు చేశాడు. కొహ్లి 17 పరుగులకే అవుటైనా, రహానే 23 పరుగులు చేసేసరికి భారత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత సెకండిన్నింగ్స్ ప్రారంభించిన న్యూజీలాండ్ కు చుక్కలు కనిపించాయి. అశ్విన్ విజృంభణ ను వారు ఏ దశలోనూ తట్టుకోలేకపోయారు. ఓపెనర్ల వికెట్లు రెండూ యాదవ్ , జడేజాలకు పడిపోబట్టి సరిపోయింది గానీ.. లేకపోతే.. ఇవాళ ఇండోర్ లో , ఒకనాటి ఢిల్లీలో కుంబ్లే అరుదైన ఫీట్ రిపీట్ అయిఉన్నా ఆశ్చర్యం లేదు. అశ్విన్ అంత జోరు మీద ఉన్నట్లుగా కనిపించాడు. కేవలం 44.5 ఓవర్లలో 153 పరుగులకు వారి ప్రస్థానం ముగిసింది.
మొత్తం మూడు మ్యాచ్ ల సిరీస్ లో 27 వికెట్లు తీసిన రవిచంద్ర అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ తో పాటు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా లభించింది. అశ్విన్ అద్భుతాల ముందు కొహ్లి డబుల్, రహానే, పుజారా సెంచరీలు తేలిపోయాయనే చెప్పాలి.

