అలర్ట్ కాంగ్రెస్ : ఉక్కుమనిషి మాటే ప్రణబ్ ది కూడా !

నోట్ల రద్దు అనే ఒకే అంశాన్ని పట్టుకుని దాదాపు పదిహేను రోజులుగా దేశంలోనే అత్యున్నత శాసన నిర్ణాయక వేదిక అయిన పార్లమెంటును స్తంభింపజేయడం పెద్దలను అసహనానికి గురిచేస్తోంది. సభలో సీనియర్ మోస్ట్ ఎంపీల్లో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీ ఈ విషయంలో బుధవారం అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సభకు అంతరాయం కలిగించే హక్కు సభ్యులకు లేదని, అసలు వారి వేతనాలు కత్తిరించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అద్వానీ, స్పీకరు సుమిత్రా మహాజన్ కు ఫిర్యాదు చేశారు. పాలక ప్రతిపక్షాలు ఇద్దరినీ ఆయన తప్పు పట్టారు. కాంగ్రెస్ వైఖరి బాగోలేదంటూ మండిపడ్డారు.
అయితే ఇప్పుడు దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అదే మాట అంటున్నారు. పార్లమెంటు సభ్యలకు సభలో చర్చించే హక్కు ఉంటుందే తప్ప, సభను అడ్డుకునే హక్కు ఉండదంటూ ఆయన నిశిత విమర్శలు చేస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీ కూడా ఎంపీగా ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న విలువలుగల పార్లమెంటేరియన్ కావడం ఇక్కడ గమనార్హం. ఆయన స్వయంగా శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటుకు ఎంపీలను ప్రజలు పంపింది వారు ధర్నాలు చేయడానికి కాదని తెలుసుకోవాలని ప్రణబ్ దాదా హితవు చెప్పడం గమనార్హం.
నిన్న అద్వానీ జీ తప్పు పడితే, ఆయన అధికార పార్టీ వాడు గనుక.. అలా అన్నారని కాంగ్రెస్ తమ ఆందోళనలను సమర్థించుకోవచ్చు. కానీ.. ప్రస్తుతం వారి వైఖరిని తప్పుబట్టినది ఒకప్పుడు వారి పార్టీ సీనియర్ నాయకుడే అయిన ప్రణబ్ దాదానే. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తమ వైఖరిని మార్చుకుని పార్లమెంటును సజావుగా సాగనిస్తారా లేదా అనేది చూడాలి. తమ సొంత పార్టీ నేత, పైగా సాక్షాత్తూ రాష్ట్రపతి తప్పుపట్టిన తర్వాత కూడా వైఖరి మార్చుకోకపోతే.. అది వారి అనాలోచితమైన, అసమంజసమైన వ్యవహార సరళి అవుతుంది.

