అర్రెర్రె : మన కుబేరుడు కూడా మాయగాడేనంట!

‘‘ఓ అప్పారావు... ఓ సుబ్బా రావు... ఓ వెంకట్రావు... ఓ రంగా రావు... ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా... అయినా కానీ... రెడీ రెడీ రెడీరెడీ... ’’ అంటూ సాగుతుంది ఓ సినీగీతం. ఈ సినిమా పాట లాగా తయారైంది పరిస్థితి.. హైదరాబాదులో పది వేల కోట్ల రూపాయల నల్లధనం ఉన్నట్లుగా వెల్లడించిన అపర కుబేరుడు ఎవరా? అంటూ ఇన్ని రోజులూ రాజకీయ నాయకులు తలలు పట్టుకున్న సంగతి తెలిసిందే. అతను ఎవరైనా గానీ.. పన్నులు వసూలు చేసేద్దాం అనుకున్నారు ఐటీ అధికారులు. దీనిమీద రాజకీయ విమర్శలు ప్రతివిమర్శలు యుద్ధం రేంజిలో జరిగాయి. ‘ఎవరో ఎవరో ఉంటారనుకుంటే.. చివరికి ఓ అనామకుడి పేరు బయటకు వచ్చింది. ఆయనగారు బాణాపురం లక్ష్మణరావు. తొలివిడతగా చెల్లించాల్సిన పన్ను చెల్లించకపోయే సరికి ఐటీ అధికారులు రంగంలోకి దిగి, సోదాలు జరిపితే.. అతనూ మరియు అతని వ్యాపారామూ, పదివేల కోట్ల నల్ల సంపదా అంతా.. మరో బురిడీ వ్యవహారం అని తేలుతోంది. అహ్మదాబాద్ నుంచి 13 వేల కోట్ల ఆదాయం చూపించిన మహేష్ షా మాదిరిగా బాణాపురం లక్ష్మణరావు కూడా ఎవరి సొత్తుకైనా బినామీగా ఉండడానికి ప్రయత్నించి, తీరా తేడా వచ్చిందేమో అని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆరా తీస్తున్నారు.
మోదీ పిలపు ఇచ్చిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో అహ్మదాబాద్ లో మహేష్ షా అనే వ్యక్తి 13 వేల కోట్ల నల్లధనం ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. తీరా పన్ను కట్టవలసిన రోజు వచ్చిన తర్వాత చేతులెత్తేసి, కొందరికి బినామీగా వారి సొత్తును చూపించడానికి అలా ప్రకటించాల్సి వచ్చినదంటూ చెప్పిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఆ సమయంలో హైదరాబాదులో ఓ వ్యాపారి పదివేల కోట్ల రూపాయల నల్లధనం చూపించారని సమాచారం వచ్చినప్పడు అంతా నిర్ఘాంత పోయారు. దీనిపై చంద్రబాబునాయుడు కూడా.. ఒక వ్యక్తి పదివేల కోట్లు ఎలా నల్లధనం పోగేశారో అర్థం కావడం లేదంటూ.. నర్మగర్భపు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన జగన్ ను ఉద్దేశించే మాట్లాడుతున్నారంటూ వైకాపా నాయకులు తీవ్రస్థాయిలో ఎదురు దాడులకు దిగారు. హైదరాబాదులో పదివేల కోట్లు వెల్లడించిన కుబేరుడు ఎవరా అని పలు పేర్లను ప్రజలు ఊహాగానాలు చేసుకున్నారు. తీరా అది బాణాపురం లక్ష్మణరావు అని తేలింది.
ఆయన మరియు కుటుంబ సభ్యుల పేర్లు అయిదు కంపెనీల్లో డైరక్టర్లుగా ఉన్నాయి. ఆయన డబ్బు కట్టలేని పరిస్థితిలో ఉండగా.. ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకుని, అంత సొమ్ము ప్రకటించడం వెనుక కారణాలేమిటో.. ఎవరి సొమ్ముకు బినామీగా ఉండడానికి అలాంటి ప్రకటన చేశారో ఆరా తీయడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారుట! మొత్తానికి ఈ లక్ష్మణరావు ఎవరో గానీ.. హైదరాబాదులోని మహేష్ షా లా నిగ్గు తేలుతున్నాడని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

