అయ్యర్ పై ముప్పేట దాడి

కాంగ్రెస్ మాజీ నేత మణిశంకర్ అయ్యర్ ను కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా తప్పుపడుతున్నాయి. మణి శంకర్ అయ్యర్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని భావించిన కాంగ్రెస్ మిత్ర పక్షాలు కూడా అయ్యర్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నాయి. తాజాగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అయ్యర్ ను సస్పెండ్ చేయడం కాదు పార్టీ నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయ్యర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని లాలూ కోరారు.
పాక్ అధికారులతో.....
మరోవైపు బీజేపీ అయ్యర్ పై మరో ఆరోపణ చేసింది. అయ్యర్ వ్యాఖ్యల వెనక పాక్ హస్తముందని బీజేపీ నేత అజయ్ అగర్వాల్ అన్నారు. ఈనెల 6వ తేదీన పాక్ హైకమిషనర్ తో మణిశంకర్ అయ్యర్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భేటీ అయ్యారని అగర్వాల్ ఆరోపించారు. తమకు ఈ విషయంలో ఖచ్చితమైన సమాచారం ఉందన్నారు. మణి శంకర్ అయ్యర్ నివాసంలోనే ఈ రహస్య భేటీ జరిగిందని ఆయన తెలిపారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పాక్ సాయం కోరుతుందని కూడా బీజేపీ వ్యాఖ్యానించింది. మొత్తం మీద అయ్యర్ పై ముప్పేట దాడి ప్రారంభమైంది.
- Tags
- మణిశంకర్అయ్యర్

