అమ్మకు ఆప్తుడు, తమిళ దిగ్గజం ‘చో రామస్వామి’ ఇక లేరు!

తమిళ ప్రజలకు అంతలోనే మరో విషాదం. తమిళనాడు రాష్ట్రం గర్వించదగిన ప్రముఖుల్లో ఒకరైన ‘చో రామస్వామి’ కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అస్వస్థతతో ఉన్న రామస్వామి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నమూశారు. తమిళనాడులో దిగ్గజం అనదగిన సీనియర్ పాత్రికేయుడిగా, నటుడిగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, పత్రికా సంపాదికుడిగా రామస్వామికి అనన్యమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. తుగ్లక్ పత్రిక సంపాదకుడిగా ముద్ర పడడంతో అభిమానులు ఆయనను ప్రేమగా ‘తుగ్లక్ రామస్వామి’ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు.
చో రామస్వామి సీనియర్ నాయకుడు. తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు, ఇంకా అనేక మంది రాజకీయ ప్రముఖులకు ఆయన ఎంతో సన్నిహితులు. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా రామస్వామి పట్ల ఎనలేని గౌరవం ఉంది. రామస్వామి అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రధాని మోదీ స్వయంగా వచ్చి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడం కూడా గతంలో జరిగింది. 1999-2005 మధ్య ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.
జయలలితతో చో రామస్వామికి మంచి అనుబంధం ఉంది. స్వయంగా నటుడు దర్శకుడు కూడా అయిన ఆయన జయలలితతో కలిసి అనేక నాటకాల్లోను, సినిమాల్లో కూడా నటించారు. హీరోయిన్ రమ్యకృష్ణకు ఆయన స్వయానా మేనమామ. 82 ఏళ్ల చో రామస్వామి అనారోగ్యంతో కన్నుమూయడం తమిళ ప్రజలకు రెండు రోజుల వ్యవధిలోనే ఎదురైన మరో విషాదంగా పేర్కొనాలి.
తుగ్లక్ నాటకంతో ఆయన దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందారు. అదే పేరుతో పత్రిక స్థాపించి.. అందులో చేసే రాజకీయ విశ్లేషణ ల ద్వారా మరింత పేరు సంపాదించారు. రామస్వామి మరణం పట్ల ప్రధాని మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సహా రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

