అమ్మ టెన్షన్ : పోలీసుల్తోపాటు విపక్షనేతల్లోనూ భయం

జయలలిత ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో తమిళనాడు యావత్తూ అప్రకటిత కర్ఫ్యూ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అమ్మ జయలలితకు సంబంధించి ఎలాంటి దుర్వార్త వెలువడినా సరే.. రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు చాలా పెద్దస్థాయిలో చెలరేగుతాయనే భయంతో పోలీసులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. 9 పారా మిలిటరీ బలగాల సాయం తీసుకుంటున్నారు. మండల స్థాయి నుంచి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాల్సిందిగా డీజీపీ ఇప్పటికే ఆదేశించారు.
రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. అమ్మ గురించి దుర్వార్త అనివార్యం అయితే.. రాష్ట్రమంతా భగ్గుమంటుందని పోలీసులు భయపడుతున్నారు. ఈ భయం కేవలం తమిళనాడు పోలీసుల్లో మాత్రమే కాదు. అందరిలోనూ ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే తమిళనాడుకు తమ బస్సు సర్వీసులను నడపడం తాత్కాలికంగా నిలిపివేసింది. చెన్నయ్ సరిహద్దు ప్రాంతాలైన చిత్తూరు, నెల్లూరు జిల్లాలనుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను కూడా రద్దు చేసే ఆలోచన చేస్తున్నారు. ఇదంతా పోలీసుల పరంగా పడుతున్న భయాలైతే విపక్షనేతల్లో కూడా భయం కనిపిస్తోంది.
జయలలిత పరిస్థితి సీరియస్ గా ఉన్నదనేసమాచారం తెలియగనే రాష్ట్ర పర్యటనలో విపక్ష నాయకుడు స్టాలిన్, తన పర్యటన రద్దు చేసుకుని చెన్నయ్ వచ్చేశారు. ఆయన డీజీపీని ప్రత్యేకంగా కలిసి శాంతిభద్రతలను కాపాడడం గురించి విజ్ఞప్తి చేశారు. జయలలిత కోలుకోవాలంటూ ప్రకటన చేసిన ఆయన, విడిగా డీజీపీని కలిసి ఏదైనా దుర్వార్త వినాల్సి వస్తే ... తమ పార్టీ కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగే అవకాశం ఉందని.. పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.
అలాగే పోలీసులు మాల్స్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా అల్లర్లు దాడులు జరగకుండా చూసేలా బలగాలను మోహరిస్తున్నారు. ప్రధానంగా జయలలిత మీద విమర్శలు చేస్తూ ఉండే విపక్షాలకు చెందిన నాయకుల ఇళ్ల వద్ద పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. మొత్తానికి అమ్మ ఆరోగ్యం విషమిస్తుండడంతో.. తమిళనాడు వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

