అమ్మ జయలలితకు గుండెపోటు : ఆందోళనలో తమిళసీమ

తమిళనాడు ముఖ్యమంత్రి, పురట్చి తలైవి ‘అమ్మ’ జయలలిత కు గుండెపోటు వచ్చింది. దాదాపు ఒకటిన్నర నెల రోజులుగా చెన్నయ్ అపోలో ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్న జయలలిత పరిస్థితి కుదుట పడుతున్నదని.. మరి కొన్ని రోజుల్లో ఆమె యథోరీతిగా తన కార్యకలాపాలు నిర్వహించగలదని అభిమానులు ఆశిస్తున్న తరుణంలో.. హఠాత్తుగా ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది. ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు వచ్చినట్లుగా ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో ఆమెను సాధారణ వార్డు నుంచి తిరిగి ఐసీయూకు తరలించారు. కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టులతో చికిత్స అందిస్తున్నట్లుగా ఆస్పత్రి ప్రకటించింది.
జయలలితకు గుండెపోటు వచ్చిందనే వార్తలతో తమిళనాడు మొత్తం మరోసారి ఆందోళనాత్మక పరిస్థితి ఏర్పడింది. అమ్మ అభిమానులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. చెన్నయ్ లోని వారు మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాలనుంచి కూడా అభిమానులు అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. జయలలిత ఆరోగ్యం కుదుటపడడం కోసం అప్పుడే అనేక ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా మొదలయ్యాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి ఆదివారం రాత్రి విషమించడంతో రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబాయి నుంచి చెన్నయ్ బయల్దేరినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్నాధ్ సింగ్ కూడా విద్యాసాగార రావుతోను, ఆస్పత్రి వైద్యులతోను మాట్లాడి జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 22 వ తేదీనుంచి జయలలిత ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారు.

