‘అమ్మ’ చుట్టూ ఇంకా అనేక భయాలు , ఆశలు!!

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం గురించి అపోలో వైద్యులు అప్పుడప్పుడూ నోరు విప్పుతున్నా.. అమ్మ ఆరోగ్యం భేషుగ్గా ఉందంటూ అన్నాడీఎంకే మాత్రం రోజుకు పదిసార్లు చెప్పుకుంటూనే ఉంది. ఒక రోజు జయ సైగలు చేస్తున్నారని, మరో రోజు జయ పేపర్లు కూడా తిరగేస్తున్నారని.. ఇంకోసారి అమ్మ చిన్నగా మాట్లాడే ప్రయత్నం కూడా చేసేస్తున్నారని.. కార్యకర్తల్లో, అభిమానుల్లో అమ్మ భక్తి కొనసాగేలా చేస్తోంది.. కానీ ఇదంతా వాళ్లు చెప్పడం వరకే.. అప్పుడెప్పుడో జయ హెల్త్ పై బులెటిన్ రిలీజ్ చేసిన అపోలో మాత్రం ఒకే మాట చెప్పుకొస్తుంటారు.. జయకు ఇంకా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అవసరం.. వాళ్లు చెప్పే ఒకే ఒక డైలాగ్ ఇదే. ఇక హేమాహేమీలు ఎవరు అమ్మ పరామర్శకు వెళ్లినా.. వారికి కనీసం ఆమెను చూసే భాగ్యం కూడా దక్కదు. గవర్నరేంటి.. సాక్షాత్తూ కేంద్ర మంత్రులు, యూపీఏ ఉపాధ్యక్షుడు వెళ్లినా జరిగింది ఇదే.
ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ జయలలితను పరామర్శించేందుకు రంగం సిద్ధం అవుతుండడంతో.. అమ్మ నిజంగానే కోలుకున్నారా అనే ఆశలు అభిమానుల్లో కలుగుతున్నాయి. లేదంటే.. ప్రధాని అంతటి వారు పరామర్శకు వస్తే ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు ఆయన్ను దూరం పెట్టడం కష్టం. అందుకే అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నట్లు జయ నిజంగానే కోలుకునే ఉంటారని అభిమానుల్లో ఆశలు మెరుస్తున్నాయి.. అంతా అనుకున్నట్టే జరిగితే ఇవాళో, రేపో.. లేదా మరికొన్ని రోజుల్లో అపోలో ఆస్పత్రికి వెళ్లి జయ ఆరోగ్యంపై వైద్యుల దగ్గర ఆరా తీసే అవకాశం ఉంది. ప్రధాని ఈరోజే వస్తారనే ప్రచారంతో చెన్నయ్ పాత విమానాశ్రయం వద్ద భారీ భద్రత ను కూడా ఏర్పాటు చేశారు.
ప్రధాని స్వయంగా జయ ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారని.. చెబుతున్నారు. ఇది త్వరలో జరగనున్న ఎన్నికల్లో జయ అభిమానుల నుంచి బీజేపీకి మైలేజి తెచ్చిపెట్టడంతోపాటూ.. కావేరీ జలాల ఇష్యూలో కేంద్రంపై తమిళనాట కాస్త సాఫ్ట్ కార్నర్ కూడా వచ్చేలా చేస్తుందని కూడా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్నల్లా ఒకటే.. సెప్టంబర్ 22 నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయ నిజంగానే కోలుకున్నారా.. అలాంటప్పుడు విపక్షాలు గోల చేస్తున్నా.. జయ వీడియోలు, ఫొటోలు అన్నాడీఎంకే వర్గాలు ఎందుకు బయటపెట్టడం లేదు. వ్యవహారాన్నంతా ఇంత గుట్టుగా నడపాల్సిన అవసరం ఏముంది.. ఎన్ని రోజులు ఇలా చేయగలరు.. ప్రధాని పరామర్శతో అయినా జయ ఆరోగ్యంపై వస్తున్న సందేహాలకు, వదంతులకు తెర పడుతుందని అమ్మ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

