అమ్మ గురించి మరింత క్లారిటీ : చికిత్సకు ఓకే

తమిళనాడు ముఖ్యమంత్రి పురట్చి తలైవి జయలలిత క్షేమంగానే ఉన్నారు. ఆమె చికిత్సకు సక్రమంగా స్పందిస్తున్నారంటూ.. చెన్నై అపోలో వైద్యులు సోమవారం సాయంత్రం ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. దీంతో అభిమానులకు ఆమె ఆరోగ్యం గురించి మరింత స్పష్టత ఇచ్చినట్లయింది. యాంటి బయోటెక్స్ ఇస్తున్నందున జయలలిత చికిత్సకు సక్రమంగా ప్రతిస్పందిస్తున్నారని బులెటిన్ లో వైద్యులు తెలియజేశారు. ఆమె ఆరోగ్యం కుదురుగా ఉన్నదని, అయితే మరి కొన్ని రోజుల పాటు ఆమె అపోలో ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అలాగే లండన్ నుంచి ఆమెకోసం ప్రత్యేకంగా వచ్చిన డాక్టర్ రిచర్డ్ బెలె సోమవారం నాడు తిరిగి వెళ్లిపోయారు.
జయలలిత ఆరోగ్యం గురించి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో విపరీతమైన ఆందోళనలు నెలకొని ఉన్నాయి. ప్రత్యేకించి అమ్మ అభిమానులు కొన్ని రోజులుగా ఆస్పత్రి వద్దనే వేచి ఉండి విలపిస్తూ గడిపారు. అపోలో వైద్యులు ఏ సంగతి తేల్చకుండా, ఒక రోజు టెన్షన్ పెట్టినప్పటికీ రెండో రోజు సాయంత్రానికి ఒక బులెటిన్ ఇచ్చి స్పష్టత తెచ్చారు.
అదే సమయంలో , చికిత్స గురించి అందించిన క్లారిటీ కి సమాంతరంగా.. మరిన్ని పుకార్లు కూడా తమిళనాట వ్యాప్తిలోకి వచ్చాయి. జయలలిత నెచ్చెలి శశికళ , పన్నీర్ సెల్వం తదితరులతో సమావేశం అవుతున్నారని, అధికారాన్ని తన చేతిలోకి తీసుకోవడానికి చూస్తున్నారని ఇలాంటి వదంతులు వచ్చాయి. ఇలాంటి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ.. సోమవారం సాయంత్రం మరొక హెల్త్ బులెటిన్ వచ్చింది. జయలలిత బాగా స్పందిస్తున్నారని అందులో పేర్కొన్నారు.
అయితే, జయలలిత వాస్తవ ఆరోగ్య పరిస్థితిని ఫోటోల సహా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిందేనంటూ మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దాని మీద ఎలాంటి ఆదేశాలు వస్తాయో చూడాల్సి ఉంది.

