అమెరికాకు ఏమైంది ...?

ప్రపంచ పెద్దన్న అమెరికాకు ఏమైంది ...? డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టాక యుఎస్ కు రోజుకో సమస్య ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నిన్న మొన్నటివరకు ఉత్తరకొరియా తో యుద్ధమేఘాలు కమ్ముకొచ్చే స్థితి ఆందోళన పరిస్తే ఆ వివాదం పూర్తిగా సమసిపోకుండా తాజాగా ప్రభుత్వాన్ని మూసేసి పరిస్థితి ఎదురైంది. ఏదో దుకాణం ముసేసినట్లు ప్రభుత్వం మూసెయ్యడం ఏమిటా అంటే... అక్కడ కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు సెనేట్ తిరస్కరించడం ఆర్ధిక సంక్షోభానికి తెర లేచేలా చేసింది. ఈ బిల్లు సెనేట్ లో ఆమోదం పొందకపోవడంతో జనవరి 19 నుంచి ప్రభుత్వశాఖలన్నీ (అత్యవసర శాఖలు తప్ప ) అన్ని నిద్రావస్థలోకి పోయినట్లే. రోజు వారీ ప్రభుత్వ ఖర్చులకు ఇక అనుమతి లేదు. రక్షణ వంటి కొన్ని కీలక రంగాలవరకు మినహాయింపు ఉంటుంది. 40 శాతం మంది ఉద్యోగులు వేతనం లేని సెలవుల్లోకి వెళ్ళిపోతారు. ఈ పరిణామం ప్రపంచ బాస్ గా చలామణి అయ్యే అమెరికా ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావమే చూపిస్తుంది. వారానికి సుమారు 42 వేలకోట్ల రూపాయలు ఆర్ధిక నష్టాన్ని అమెరికా ఇక చవిచూడనుంది.
అసలు ఏం జరిగింది...?
అమెరికాలో ఉద్యోగాల రీత్యా స్థిరపడిన వారి పిల్లలను డ్రీమర్స్ గా పిలుస్తారు. వీరికి చట్టబద్ధ రక్షణ కల్పిస్తూ ఒబామా సర్కార్ కాలంలో ఒక చట్టాన్ని రూపొందించారు. ట్రంప్ సర్కార్ ఈ చట్టాన్ని మార్పు చేసింది. ద్రవ్య వినిమయ బిల్లులో వీరి రక్షణకు నిధులు కేటాయించాలని డెమొక్రాట్లు పట్టుబట్టారు. రిపబ్లికన్ లు ఎక్కువ మెజారిటీ వున్న ప్రతినిధుల సభలో ట్రంప్ సర్కార్ బిల్లును పాస్ చేయించగలిగినా సెనేట్ లో డెమొక్రాట్స్ ఆధిపత్యం ఎక్కువగా ఉండటానికి తోడు కొందరు రిపబ్లికన్ ప్రతినిధులు విపక్ష వాదనతో జత కట్టారు. బిల్లు ఆమోదం కోసం చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. నిర్ధేశిత సమయం లోగా ద్రవ్య వినిమయ బిల్లు కాంగ్రెస్ లో ఆమోదం కాకపోవడంతో ఇక సర్కార్ కార్యకలాపాలు బంద్ అయ్యే దుస్థితి ఏర్పడింది.
గతంలోనూ ఇలాంటి సంక్షోభాలు ...
అమెరికా ప్రభుత్వాలకు ఇలాంటి సంక్షోభాలు కొత్తేమి కాదు. గతంలో 1981 నుంచి ఇప్పటివరకు 12 సార్లు ప్రభుత్వం ఇలాగే మూతపడింది. 1995 -1996 ఏడాదిలో బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా వున్నప్పుడు 21 రోజులపాటు సర్కార్ బండి నడవలేదు. ఈసారి ప్రస్తుత ఆర్ధిక సంక్షోభం ఫిబ్రవరి 16 వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ట్రంప్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తి అయ్యి ఒక్కరోజు దాటిందో లేదో యుఎస్ పెను సంక్షోభంలో కూరుకుపోయింది. అసలే ఏడాదికాలంగా ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలం అయిన అగ్రరారాజ్యానికి మరో సంక్షోభం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉందని భావించాలంటున్నారు విశ్లేషకులు.
- Tags
- అమెరికా

