అమెరికా ఏమాత్రం తగ్గడం లేదే...!

అమెరికా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ మెడలు వంచేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈరోజు అమెరికా దక్షిణా కొరియాతో కలిసి డ్రిల్ చేపట్టింది. ఉత్తర కొరియాను లక్ష్యంగా చేసుకునే ఈ డ్రిల్ ను నిర్వహించింది. గువామ్ ద్వీపం నుంచే అమెరికా ఈ డ్రిల్ చేపట్టడంతో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే కిమ్ అణు క్షిపణుల ప్రయోగాలను పరీక్షిస్తూ అమెరికాకు సవాల్ విసురుతున్నాడు. అమెరికాను వదిలిపెట్టేది లేదంటూ శపథం మీద శపథం చేస్తున్నాడు. దీనికి అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ కూడా తగ్గడం లేదు. ప్రపంచ దేశాల దృష్టికి కిమ్ చేస్తున్న విన్యాసాలను ఇప్పటికే ట్రంప్ తీసుకు వచ్చారు. అయినా కిమ్ కవ్వింపులకు తాము బెదిరేది లేదని చెప్పడానికే అమెరికా పలుమార్లు ఉత్తర కొరియాను లక్ష్యంగా చేసుకుని డ్రిల్ నిర్వహించింది.
డ్రిల్ తో భయపడమన్న కిమ్....
తాజాగా శుక్రవారం గువామ్ ద్వీపంలో అమెరికా, దక్షిణ కొరియాలు కలిసి నిర్వహించిన ఈ డ్రిల్ ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమ సైనిక సత్తా ఏందో తెలియజెప్పేందుకే ఈ డ్రిల్ నిర్వహించినట్లు తెలుస్తోంది. కిమ్ యుద్ధానికి దిగకుండా సాధ్యమైనంత మేరకు ప్రయత్నించాలన్నదే అమెరికా వ్యూహంగా ఉంది. గువామ్ లోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి రెండు యుద్ధ విమానాలను ఉత్తరకొరియా ద్వీపంపైకి పంపడం విశేషం. అయితే ఈ డ్రిల్ ను ఉత్తరకొరియా తీవ్రంగా ఖండించింది. తాము ఇలాంటి వాటికి భయపడబోమని ఉత్తరకొరియా తేల్చి చెప్పింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆదివారం ఆసియాలో పర్యటించనున్నారు. తొలుత జపాన్ లో పర్యటించిన అనంతరం ఆయన దక్షిణ కొరియాకు వెళ్లనున్నారు. ఈనేపథ్యంలో డ్రిల్ నిర్వహించడం గమనార్హం.

