అమరావతికి శంకుస్థాపనకు రానున్న అరుణ్ జైట్లీ

ఇంకా అక్కడ ఏం శంకుస్థాపనలు మిగిలి ఉన్నాయబ్బా.. అని ఆశ్చర్యపోతున్నారా? కేంద్రంతో సానుకూలంగా ఉంటూనే మనకు కావాల్సిన పనులు చక్కబెట్టుకోవాలనే సిద్ధాంతాని ఆచరణలో పెడుతున్న చంద్రబాబునాయుడు మొత్తానికి కేంద్రంలో మోదీ తర్వాత అంతటి పవర్ ఫుల్ వ్యక్తిగా ఉన్న అరుణ్ జైట్లీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డట్లున్నారు. మోదీ అమరావతిలో కోర్ కేపిటల్ ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర సాయం గురించి పూర్తి ఖర్చు తామే భరిస్తాం అంటూ ప్యాకేజీ లో భాగంగా ప్రకటించిన నేపథ్యంలో , సదరు జైట్లీనే పిలిపించి.. ఆయన చేతుల మీదుగానే కోర్ కేపిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయించబోతున్నారు.
కేంద్రాన్ని ప్రసన్నం చేసుకుని పనులు నెరవేర్చుకోవడం అనే సిద్ధాంతమే కరెక్టు అని చంద్రబాబు భావిస్తున్నట్లుంది. అమరావతి రాజధాని నగరాన్ని నభూతో నభవిష్యతి అన్నట్లుగా నిర్మించడానికి కేంద్రం నుంచి ఇతోధికంగా నిధులు పిండుకోవచ్చుననే ఉద్దేశంతో , అమరావతి శంకుస్థాపన పేరిట గత ఏడాది విజయదశమినాడు మోదీతో శంకుస్థాపన చేయించారు. కానీ దానివలన వీసమెత్తు ప్రయోజనం కనిపించలేదు. ఏడాది తర్వాత.. ఇబ్బడి ముబ్బడిగా నిధులు తర్వాత.. ఏదో ఊరడింపుగా ఒక ప్యాకేజీ ప్రకటించారు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.
కేంద్రం నుంచి ఏం రాబట్టుకోవాలన్నా సరే.. మోదీని మించిన మంత్రదండం జైట్లీ చేతుల్లోనే ఉన్నదని చంద్రబాబుకు ఇన్నాళ్లకు అర్థమైనట్లుంది. అమరావతి కోర్ కేపిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఆయననే ఆహ్వానించారు. ఈనెల 28న జైట్లీ అమరావతి రానున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాల సముదాయానికి శంకుస్థాపన జరుగుతుంది. అదే సమయంలో ఆయన ద్వారా ప్యాకేజీ గొప్పదనం గురించి వివరించేలా.. పార్టీ ద్వారా ఒక సభ ఏర్పాటు చేయడానికి భాజపా కూడా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

