అమరావతి నిర్మాణానికి లండన్ వారి డిజైన్లు!

మొత్తానికి అమరావతి నగర నిర్మాణంలో కీలక వ్యవహారాలు కొన్ని ఒక కొలిక్కి వస్తున్నాయి. అమరావతి నగరంలోని కీలక భవనాల డిజైన్లను అందించే మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎవరు అనే విషయంలో చాన్నాళ్లుగా ఉన్న ప్రతిష్టంభన తొలగినట్లే. ఇదివరకు జపాన్, సింగపూర్ కంపెనీలతో చేయించిన డిజైన్లు నానా కంగాళీగా ఉన్నట్లు తేలడంతో.. కొత్తగా మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపిక బిడ్ లు పిలిచారు. వీరిలో లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్స్ సంస్థ అతి తక్కువగా 67 కోట్ల రూపాయలకు బిడ్ లు దాఖలు చేయడంతో వారిని ఎంపిక చేసినట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. మొత్తానికి ప్రపంచం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని అనుకుంటున్న చంద్రబాబునాయుడు స్వప్నాన్ని సాకారం చేయడానికి లండన్ డిజైన్లు తీసుకుంటున్నారు.
బిడ్ ల విషయం ఖరారు అయినప్పటికీ.. ఎంత గడువులోగా వీరు డీటైల్డ్ డిజైన్లు ఇస్తారనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు మూడు నెలల్లోగా డిజైన్లు ఇచ్చేయాల్సి ఉంటుందని నారాయణ అంటున్నారు. కోర్ కేపిటల్ పరిధిలోకి వచ్చే లాండ్మార్క్ భవనాలుగా పరిగణించే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి వాటన్నింటినీ ఈ సంస్థే రూపొందిస్తుంది.
అయితే లండన్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ చేసే రూపకల్పనలో భారతీయత ఉట్టిపడుతుందా... లేదా వారి మూలాలు లండన్ లో ఉన్నవి గనుక.. మనకు మళ్లీ బ్రిటిష్ పాలకులను గుర్తుకు తెచ్చేలా బ్రిటన్ వాస్తునిర్మాణ రీతులు ప్రతిబింబిస్తాయా అనేది చూడాలి.
అమరావతి పనుల దిశగా మరో ముందడుగు..
అమరావతిలో ఇన్ఫ్రా స్ట్రక్చర్ పనులు చేపట్టడానికి ఓ కీలకమైన ముందడుగు పడింది. అమరావతి నిర్మాణానికి రుణాలు సమకూర్చడానికి హామీ ఇచ్చిన హడ్కో తొలివిడత నిధులను విడుదల చేసింది. తొలివిడతగా మంగళవారం 1275 కోట్ల రుణం లభించింది. రహదారులు, ఇతర మౌలిక వసతుల కోసం దీనిని ఖర్చు చేస్తారు. అమరావతి నగర నిర్మాణానికి మత్తం 7500 కోట్ల రుణాలు సమకూర్చడానికి హడ్కో ఒప్పందం చేసుకుంది. మౌలిక వసతుల పనులకు అంతరాయం కలగకుండా.. నిధులు సకాలంలో విడుదల కావడం.. అమరావతి పనుల దిశగా శుభవార్తగానే పరిగణించాలి.

