అమరావతి కి బాహుబలి డిజైన్స్ సాధ్యమేనా..?

జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో ఏపీ సర్కార్ కొంత ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. హరిత ట్రిబ్యునల్ ఏర్పాటుచేసిన కమిటీతో అమరావతి రూపురేఖలు ఉండాలిసిరావడంతో భారీ కట్టడాల నిర్మాణం ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నార్మన్ పోస్టర్స్ రూపొందించిన డిజైన్లలో మళ్ళీ మార్పు చేర్పులు తప్పేలా లేవు. దేశ రాజధానిని తలదన్నే రీతిలో 32 వేలఎకరాల్లో ఒక కొత్త నగరాన్ని హైటెక్ హంగులతో నిర్మిద్దామని తలచిన చంద్రబాబు చేతికి పూర్తి స్వేచ్ఛ ఇప్పుడు లేకుండా పోయింది. ప్రతి నిర్మాణాన్ని కమిటీ పరిశీలించి ఆమోద ముద్ర వేయాలిసివస్తుంది. దాంతో బాబు ఇప్పుడు గ్రీన్ అమరావతి కాన్సెప్ట్ తో ముందుకు పోక తప్పదు.
ప్రచారం మార్చిన చంద్రబాబు ....
సమయానికి తగ్గ రీతిలో మారిపోవడంలో చంద్రబాబు ను మించిన వారు లేరు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు సారం గ్రహించిన చంద్రబాబు గతంలో చేసిన ప్రచారానికి భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. అంతా సోలార్ ఎనర్జీ అంటున్నారు. సైకిళ్ళు , ఎలక్ట్రిక్ వాహనాల సంచారం తో కాలుష్యరహిత అమరావతి అని మొదలెట్టేశారు. ఇప్పటినుంచి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించేశారు. రహదారికి ఇరువైపులా చెట్లు వుండాలని ఆదేశించారు. ఇక్కడ వున్న ఎండను అవకాశంగా తీసుకుందామని సోలార్ ఎనర్జీతో బతికేద్దామని ఏపీ సీఎం పిలుపునిచ్చారు. అలా తనదైన శైలిలో బాబు గ్రీన్ అమరావతి ప్రచారం ముమ్మరం చేసేసారు.
ఢిల్లీ కి మించిన రాజధాని ...
దేశ రాజధాని ఢిల్లీ 1911 లో నిర్మాణం ప్రారంభమై 1931 లో ప్రారంభించబడింది. ఢిల్లీ లో దేశ రాజధానిని 42.7 కిలోమీటర్ల విస్తీర్ణంలో 16.5 స్క్వేర్ మైల్స్ మాత్రమే. కానీ అమరావతి 32 వేల ఎకరాల్లో నిర్ణయించారు. ఇది ఢిల్లీ కి ఎనిమిది రేట్లు పెద్దదిగా ఉంటుంది. షాపింగ్ కాంప్లెక్స్ లు, మల్టీఫ్లేక్స్ లు పబ్ లు బార్ లు ఆకాశ హర్మ్యాలు , విద్యా, క్రీడా కేంద్రాలు ఇలా ఒకటేమిటి అన్ని హంగులు ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులతోనే ఏ పని అయినా చేయాలిసి ఉంటుంది. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముమ్మరంగా చేద్దామని వందల ఎకరాలు కొన్న ప్రజా ప్రతినిధులు రియల్ మాఫియా కు ఇప్పుడు చుక్కలు కనబడి పరిస్థితే ఉత్పన్నమైంది.
- Tags
- అమరావతి

