అనంత తెదేపాలో ముసలం!

సాధారణంగా కొన్ని పార్టీలు వర్గ పోరాటాలకు పేరుమోసినవిగా ఉంటాయి. వర్గాలు లేకపోతే మరేం తోచదన్నట్లుగా ఒకరి వెనుక ఒకరు కుట్ర రాజకీయాలు చేసుకుంటూ ఉంటారు. దాదాపుగా అన్ని పార్టీల్లోనూ ముఠా రాజకీయాలు లోకల్‌గా ఒకరి ఆధిపత్యం పట్ల మరొకరు కినుకగా ఉండడం ఇలాంటి వ్యవహారాలు మామూలే. అయితే తెలుగుదేశం వంటి పార్టీల్లో బయట పడకుండా అంతా గుంభనంగా లోలోపలే మంత్రాంగం నడిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఠాకక్షలు కూడా రచ్చకెక్కుతున్నాయి.
జిల్లాలో చాలా వర్గాలు ఉన్నాయి. సాధారణంగా వర్గాలకు ఉండే కులాల ప్రాతిపదిక కూడా ఇక్కడ లెక్క కాదు. ఒకే కులంలోనూ అనేక వర్గాలు ఉన్నాయి. దానికి మించి ఫ్యాక్షన్ వాసన కొంత బలంగానే ఉండే అనంతపురం జిల్లాలో ఒకే పార్టీకి చెందిన వారే అయినా నాయకులు మధ్య ఉన్న కక్షలు కార్పణ్యాలు జాస్తి.
జిల్లాలో ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి బ్రదర్స్ కు, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరికి మధ్య ఉన్న వర్గపోరాటాలు ఇప్పుడు రచ్చకెక్కుతున్నాయి. ఒకరి మీద ఒకరు బహిరంగంగా టీవీ ఇంటర్వ్యూల్లో సవాళ్లు విసురుకోవడం జరుగుతోంది.
అయితే ఈ నాయకుల మధ్య రచ్చ చంద్రబాబు వద్ద కూడా పంచాయతీ జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలు బయటకు రాలేదు గానీ.. పంచాయతీ మాత్రం జరిగినట్లు సమాచారం. అదే కర్నూలు జిల్లాలో భూమా వర్గం పార్టీలోకి రావడం పట్ల శిల్పా వర్గం కినుక వహించడం, వారి విభేదాలు వాటి గురించి చంద్రబాబు చేసిన పంచాయతీ ఇవన్నీ ఎప్పటికప్పుడు వార్తల్లోకి వచ్చాయి. అయితే అనంతపురం జిల్లా నేతల మధ్య రచ్చ గురించి చంద్రబాబు చేసిన పంచాయతీ వార్తల్లోకి రాలేదు. ఒక రకంగా ఆయన జేసీ సోదరుల్ని తీవ్రంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ విభేదాల పర్యవసానంగా భవిష్యత్తుల్లో జిల్లా తెలుగుదేశం ముఖచిత్రం గణనీయంగా మారుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

