అద్వానీ గారూ....ఏంటీ అవమానాలు?

భారతీయ జనతా పార్టీ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది తొలుత వాజపేయి...తర్వాత అద్వానీ మాత్రమే. బీజేపీ దేశంలో వేళ్లూనుకోవడానికి వీరిద్దరి కృషిని కాదనలేం. కాషాయ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త పార్టీ కార్యక్రమాల్లో అద్వానీ, వాజపేయిలను గుర్తు చేసుకుండా ఉండలేరు. కాని మోడీ, అమిత్ షాల యుగం పార్టీలోకి వచ్చిన తర్వాత అద్వానీకి అడుగడుగునా అవమానాలే జరుగుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని అందరూ భావించారు. తన గురువుగా చెప్పుకునే మోడీ అద్వీనీని తగిన విధంగా గౌరవిస్తారని భావించారు.
రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ.....
కాని మోడీకి రాజకీయ ప్రయోజనాలే ఎక్కువన్న విషయం రాష్ట్రపతి ఎన్నికల్లో రుజువయింది. అద్వానీని పక్కన పెట్టేశారు. ఇప్పుడు తాజాగా త్రిపుర ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణ స్వీకార సభలో కూడా అద్వానీకి మరోసారి అవమానం జరిగింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. త్రిపుర ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మోడీ, అమిత్ షాలతో పాటు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, అద్వానీ, రాజ్ నాధ్ సింగ్ లు హాజరయ్యారు.
త్రిపురలో మరోసారి అవమానం.....
అప్పటికే వేదికపై ఉన్న వారందరికీ మోడీ నమస్కరించుకుంటూ, పలుకరించుకుంటూ వెళుతున్నారు. అద్వానీ పక్కనే ఉన్న అమిత్ షాకు, రాజ్ నాధ్ సింగ్ కు అభివాదం చేసిన మోడీ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్న అద్వానీని పట్టించుకోలేదు. అద్వానీ మరో వైపున కూర్చుని ఉన్న మాణిక్ సర్కార్ కు నమస్కారం చేసి మోడీ ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు కాని అద్వానీని పట్టించుకోలేదు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెద్దాయనకు జరిగిన అవమానంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీకి ఇది తగదంటూ హితవు పలుకుతున్నారు. మోడీ కావాలనే చేశారా? లేక అన్యాపదేశంగా అద్వానీని చూడకుండా వెళ్లిపోయారా? అన్నది మాత్రం తెలియదు. కాని వీడియోలు, ఫొటోలను చూస్తుంటే కురువృద్ధుడు అద్వానీని కావాలనే అవమానించే విధంగా ఉంది.
- Tags
- అద్వానీ
