అతివలకు బెంబేలెత్తిస్తున్న బంగారం

నోట్ల రద్దు అనే నిర్ణయం బయటకు వచ్చిన రోజున దాని పర్యవసానం ఎలా ఉండబోతున్నది అనే విషయం మీద అనేక రకాల జోకులు స్పాంటేనియస్ గా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. మోదీ ఆశించినట్లుగా నల్లడబ్బు అనేది బయటకు రావడం జరుగుతుందో లేదో గానీ.. ఇళ్లలో గృహిణులు దాచుకున్న నల్లడబ్బు మాత్రం.. ఆ నోట్ల చెల్లుబాటు రోజులు అయిపోయింది గనుక.. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వచ్చి తీరుతుందని సరదాగా జోకులు పుట్టుకొచ్చాయి. అంతవరకు నిజమే అన్నట్లుగా.. గృహిణులు తమ తమ ఇళ్లలో దాచుకున్న సొమ్మును బయటకుతీసి భర్తల చేతుల్లో పెట్టారు. వారంతా కూడా ఆ సమయంలో మోదీ నిర్ణయాన్ని నిందించే ఉంటారు. అయితే నెలరోజుల వ్యవధిలోనే మోదీ సర్కారు అతివలకు మరో షాక్ ఇచ్చింది. ఒక్కొక్కరి వద్ద బంగారం నిల్వలు, ఆభరణాలు ఎంత ఉండొచ్చు, ఎంత ఉండరాదు అనే విషయంలో విధివిధానాల్ని ప్రకటించింది. ఇళ్లలో ఉండే బంగారం ఆభరణాల గురించిన వివరాలు వెల్లడించకపోతే, తదనుగుణమైన పెనాల్టీలు పన్నులు ఉంటాయనే కొత్త విషయాన్ని కేంద్రం ప్రకటించింది.
బంగారం నిల్వలలకు సంబంధించి కొన్ని రోజులుగా చాలా అంశాలు ప్రచారంలోకి వస్తున్నాయి. బంగారం మీద పన్ను విధిస్తారని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వీటి విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం నాడు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి మేం కొత్తగా ఏమీం చేయడం లేదని అంటూనే వడ్డింపులను ప్రకటించారు. సగటు గృహిణులకు షాక్ తినిపించారు.
జైట్లీ ప్రకటించిన ప్రకారం.. వారసత్వంగా వచ్చిన బంగారంపై ఎలాంటి పన్ను ఉండదు. అవివాహితల వద్ద 250 గ్రాములు, వివాహితల వద్ద 500 గ్రాములు, పురుషుల వద్ద 100 గ్రాముల బంగారం మాత్రమే ఉండడానికి అనుమతి ఉంది. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో కొనుగోలు చేసినవి, లెక్కచూపిన ఆదాయం ద్వారా వచ్చిన డబ్బు తో లెక్కచూపినట్లుగా చూపే బంగారంపై కూడా పన్ను ఉండదు. నగదు మార్పిడిలో భాగంగా కొన్న బంగారం మీద మాత్రమే పన్నులు ఉంటాయని జైట్లీ స్పష్టం చేస్తున్నారు. ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లులో బంగారానికి పరిమితులకు సంబంధించి కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టనే లేదని జైట్లీ చెబుతున్నారు. ఈ నిబంధనలు అన్నీ కూడా గతంలో కూడా ఉన్నవే అని ఆయన వెల్లడించారు.
లౌక్యంగా తప్పించుకున్న జైట్లీ...
అయితే బంగారం వినియోగంపై మోజు ఉండే కుటుంబాలలో ఈ ప్రకటన పెద్ద షాక్ అనే చెప్పాలి. నిబంధనలు అన్నీ గతంలో ఉన్నవే.. కొత్తగా మేమేం ఇరుకున పెట్టడం లేదు.. అనే ఒకే నర్మగర్భపు మాటతో జైట్లీ తప్పించుకున్నారు. నిబంధనలు పాతవే కావొచ్చు గాక.. కానీ.. వాస్తవంగా ఆ నిబంధనల గురించి ప్రజలకు ఉండే అవగాహన చాలా పరిమితమైనది అని చెప్పాలి. పైగా బంగారం మీద మోజు ఉండే కుటుంబాల్లో జైట్లీ చెప్పిన పరిమితులకు చాలా రెట్లు ఎక్కవ బంగారమే ఉంటుంది. నిజానికి చిన్న చిన్న పొదుపులతోనే నిత్యం బంగారం కొంటూ దాని మోతాదును పెంచుకుంటూ ఉండే వారు కూడా ఉంటారు.. వారంతా ఇప్పుడు పన్ను కోరల్లోకి వస్తారేమోననే భయం మహిళల్లో కలుగుతోంది. జైట్లీ చెప్పిన వివరణలు అన్నీ కూడా అస్పష్టంగానే ఉన్నాయని.. తమ ఇళ్లలో ఉండే బంగారానికి కూడా ప్రభుత్వం చెక్ పెట్టేలా ఉన్నదని ప్రజల్లో ఇప్పటికీ కొత్త సందేహాలు వ్యాపిస్తున్నాయి.

