అజారుద్దీన్ దీనికి అంగీకరిస్తారా?

రేవంత్ రెడ్డి పార్టీలోకి చేరడం ఖాయమని తెలియడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం కన్పిస్తోంది. రేవంత్ రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తమకు దూరంగా జరిగిన ఎంఐఎం లోటును భర్తీ చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను తెలంగాణ నుంచి పోటీ చేయించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు అధిష్టానాన్ని కూడా ఒప్పించాలని నిర్ణయించుకుంది. అజారుద్దీన్ రాకతో ముస్లిం ఓట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలో వచ్చి పడతాయని ఆ పార్టీ భావిస్తోంది. అజారుద్దీన్ పై ఇద్దరు కీలక నేతలు ఈరోజు ప్రకటన చేయడం విశేషం.
హైదరాబాద్ ఎంపీ స్థానానికి.....
అజారుద్దీన్ పక్కా హైదరాబాదీ. హైదరాబాద్ నుంచే ప్రపంచస్థాయి క్రికెటర్ గా వృద్ధి చెందారు. అయితే అజారుద్దీన్ ప్రస్తుతం ఢిల్లీలో స్థిరపడ్డారు. అజారుద్దీన్ కుటుంబం మాత్రం హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సందర్భంగా అందులో పోటీ చేయాలని అజారుద్దీన్ భావించారు. ఇక్కడక వచ్చారు. అయితే ఆయన నామినేషన్ ను తిరస్కరించడంతో ఆయన ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు. అజారుద్దీన్ ను హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు గురువారం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలి వేర్వేరు సందర్భాల్లో అజారుద్దీన్ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరారు. ఆయన ఏస్థానం కోరుకుంటే.. ఆస్థానం ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. మొత్తం మీద హైదరాబాద్ ఎంపీగా అజారుద్దీన్ ను పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి అజారుద్దీన్ వీరి ప్రతిపాదనను అంగీకరిస్తారో? లేదో చూడాలి మరి.
- Tags
- అజారుద్దీన్

