అఖిలప్రియ కొత్త కావడం వల్లనేనా?

రాజధానిలో అంతా కొందరిదే ఇష్టారాజ్యమైంది. నిన్న జరిగిన బోటు ప్రమాదం వెనక కూడా తెలుగుదేశం పార్టీ కి చెందిన కొందరు నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. కృష్ణా నదిలో రివర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలను కొందరు నేతలు ముందుగానే క్యాష్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణా నదిలో నిన్న ప్రమాదానికి గురైన బోటు మాత్రమే కాదు... పదుల సంఖ్యలో బోట్లు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నట్లు తేలింది. వీరికి అనధికార అనుమతులు ఉన్నాయని, కొందరు మంత్రులు కూడా పరోక్షంగా మద్దతు తెలపడంతో వీరికి అధికారులు కూడా భయపడాల్సి వస్తుందంటున్నారు. మంత్రి అఖిలప్రియ కొత్త కావడం, రాజధానిలో తక్కువ సమయం ఉండటం, శాఖపై పట్టుపెంచుకోకపోవడం వల్లనే అమరావతి ప్రాంతానికి ఇద్దరు మంత్రుల సహకారంతో కొందరు ఇష్టారాజ్యంగా బోట్లు తిప్పుతూ లక్షల రూపాయలు గడిస్తున్నట్లు ప్రాధమిక విచారణలో తేలింది.
పట్లు పెంచుకోకపోవడం వల్లే.....
మంత్రి అఖిలప్రియ కు పట్టు లేకపోవడం వల్లనే ఇది జరిగిందని చంద్రబాబు సయితం అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. నెలవారీ సమీక్షలు చేయకపోవడం, ఆ ప్రాంతాల్లో పర్యటించకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదం జరిగి ఉంటుందని ఆయన టెలికాన్ఫరెస్స్ లో అన్నట్లు తెలిసింది. మంత్రులు తమ శాఖపై పూర్తి అవగాహన లేకపోతే ఇలాంటి తప్పిదాలే జరుగుతాయని ఆయన సీరియస్ అయినట్లు సమచాారం. ఇంతమంది ప్రాణాలు బలిగొనడానికి అధికారుల నిర్లక్ష్యం అని కూడా కారణమని చెబుతున్నారు. టూరిజం శాఖ పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు నిబంధనలను పక్కనపెట్టి బోటును తిప్పి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు రాజధాని ప్రాంతంలో ఉన్న నేతలెవరూ మంత్రులకు తెలియకుండా వారి శాఖల్లో జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.
- Tags
- అఖిలప్రియ

