అక్కడ రాజీయత్నాలు ఫలించలేదు

కర్నూలు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీలోని ముసలం ముగింపు దశకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ ఇటీవలే పార్టీలోకి పునఃప్రవేశం చేసిన భూమా నాగిరెడ్డి, మరియు జిల్లా పార్టీ సారథ్యం చేతిలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి సోదరుల మధ్య అనాదిగా ఉన్న విభేదాలు పార్టీకి చేటు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు గ్రూపుల మధ్య రాజీ కుదిర్చడానికి తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇచ్చినట్లు కనిపించడం లేదు. కేవలం కొన్ని రోజుల కిందటే.. నంద్యాల మునిసిపల్ సమావేశం సందర్భంగా ఒకసారి రచ్చకెక్కిన గ్రూపు కక్షలు ఆ తర్వాత.. ఉభయులకు పార్టీ పెద్దల క్లాస్ పూర్తయినప్పటికీ.. శుక్రవారం నాటికి కూడా పరస్పర నిందారోపణలతో చెలరేగిపోవడం విశేషం. శిల్పా మోహన్ రెడ్డి తనకు కావాల్సిన వారికే అక్రమంగా ఇళ్ల స్థలాల కేటాయింపులు చేసుకున్నారంటూ భూమా నాగిరెడ్డి బహిరంగ ఆరోపణలు చేయగా, తన మీద చేసిన ఆరోపణలు నిరూపించినట్లయితే.. ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనంటూ శిల్పా మోహన్ రెడ్డి ప్రతిసవాళ్లు విసరడం విశేషం.
కర్నూలు జిల్లాలో ఈ రెండు గ్రూపుల మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే భూమా నాగిరెడ్డి, కూతురు అఖిలప్రియతో కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవాలని అనుకున్నప్పుడు శిల్పా మోహన్ రెడ్డి సోదరులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. జిల్లాలో తమ ప్రాబల్యానికి గండి పడుతుందని వారు భయపడ్డారు. అయితే చంద్రబాబునాయుడు స్వయంగా వారిని పిలిపించి, జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవడం ముఖ్యం అని.. పార్టీ బలపడడానికి కొన్ని అభిప్రాయ భేదాలను పక్కన పెట్టాలను మెత్తగా హితవు చెప్పి.. భూమా చేరిక కు లైన్ క్లియర్ చేశారు.
భూమా వచ్చిన తర్వాత.. కొన్ని రోజులు వాతావరణం బాగానే ఉన్నా.. ఆ తర్వాత.. సందర్భం వచ్చినప్పుడెల్లా వేడెక్కుతూనే వచ్చింది. ఇటీవల నంద్యాల మునిసిపల్ సమావేశం సందర్భంగా ఇరు వర్గాలు బాగా గొడవ పడ్డాయి. ఆ వెంటనే పార్టీ పెద్దలు ఇద్దరికీ క్లాస్ తీసుకున్నట్లు కూడా అభిజ్ఞవర్గాల సమాచారం. ఆ క్లాస్ ఎఫెక్ట్ కొన్నాళ్లు సైలెన్స్ వాతావరణం ఉంటుందని జిల్లా నాయకులు అనుకున్నారు. అయితే శుక్రవారం నాడు పరస్పర ఆరోపణలు చూస్తే.. పార్టీ పెద్దలు చేసిన రాజీయత్నాలు ఫలించలేదని అర్థమవుతోంది.

