అక్కడ కూర్చోనని చెప్పేసిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తును, ముహూర్తాలను బాగా నమ్ముతారు. తనకు వాస్తుదోషం ఉందని తెలిస్తే చాలు ఆ ఛాయలకు కూడా ఆయన వెళ్లరు. అలాంటి సంఘటనే తాజాగా జరిగింది. ఆ సీట్లో తాను కూర్చోనని కేసీఆర్ చెప్పేశారట. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా? తెలంగాణ శాసనమండలిలో కేసీఆర్ కోసం ప్రత్యేక గదిని సిద్దం చేశారు. ఈ శాసనమండలి భవనాన్ని మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ వాడుకునేది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనమండలి సమావేశాలు ఆ భవనంలోనే ప్రారంభమయ్యాయి.
వాస్తు ప్రకారం లేదని....
ఆంధ్రప్రదేశ్ నుంచి భవనాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి శాసనమండలికి వచ్చిన కేసీఆర్ అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులపై ఫైరయ్యారు. గతంలో ఏపీ శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి వినియోగించుకున్న కార్యాలయాన్ని తనకు కేటాయించాలని, వాస్తు ప్రకారం తయారు చేయించాలని మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి, అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే తాను మండలి భవనానికి వచ్చి చూసేసరికి ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఆయన పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందరిపైనా ఆగ్రహం.....
మండలిలో తన ఛాంబర్ తో పాటు, డైనింగ్ హాలుపైన కూడా కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కొత్తగా కేటాయించిన ఛాంబర్ ను ఎందుకు మార్చాల్సి వచ్చిందని నిలదీయడంతో అక్కడి వారంతా అవాక్కయ్యారట. శాసనమండలికి ఎదురుగా ఉన్న గదిని తనకు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు గతంలో మండలి ఛైర్మన్ చక్రపాణి గదిని కేటాయించమంటే ఎందుకు మార్చారని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఆ గదిని వాస్తు ప్రకారం తయారు చేయించాలని ఆదేశించారు. జూబ్లీహాలును గతంలో మాదిరిగా ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. కేసీఆర్ ఫైర్ అవ్వడంతతో ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ ఆధ్వర్యంలో పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభమయ్యాయి.
- Tags
- కేసీఆర్
