అందులో అవినీతి ఏముందంటున్న చంద్రబాబు

ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పాల్పడినది అవినీతి అవుతుందా? కాదా?
ఈ విషయంలో ఎవ్వరి అభిప్రాయాలు ఎలాగైనా ఉండొచ్చు గాక.. చర్చ కోర్టు ముంగిటకు వచ్చేసరికి చంద్రబాబు తరఫు న్యాయవాది, సిద్ధార్థ లూధ్రా అసలు ఇది అవినీతి కిందకు ఎలా వస్తుందంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి డబ్బు ఇవ్వజూపిన విషయంలో తప్పించుకోడానికి ఆస్కారం లేదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు గనుక.. అయితే తెర వెనుక నుంచి చంద్రబాబునాయుడు నడిపించారనే ఆరోపణల విషయంలో చంద్రబాబు తరఫున హైకోర్టులో వాదనలకు వచ్చిన సుప్రీం న్యాయవాది సిద్ధార్థ లూధ్రా ఈ వ్యవహారాన్ని అవినీతి కింద పరిగణించడమే కుదరదని అంటూ టెక్నికల్ పాయింటును లేవనెత్తుతున్నారు.
ప్రజావిధులను నిర్వర్తించడానికి అధికారులకు గాని, నాయకులకు గాని సొమ్ము ముట్టజెప్పబోవడం అనేది అవినీతి కిందకు, అవినీతి నిరోధక చట్టం కిందికి వస్తుందిట! అయితే ఓటు వేయడం అనేది ప్రజావిధుల్లో భాగమే కాదు గనుక.. ఓటు కోసం డబ్బు ముట్టజెప్పబోవడం అనేది అవినీతికి ప్రలోభపెట్టడం కిందికి రాదు కదా? అని సిద్ధార్థ లూధ్రా వాదిస్తున్నారు. ఈ వాదన సాంకేతిక అంశాల మిష చూపించి చంద్రబాబును కేసునుంచి కాపాడవచ్చునేమో గానీ.. పరోక్షంగా వ్యవహారంలో ఆయన పాత్రను ధృవీకరిస్తున్నట్లుగానే ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్రను నిగ్గుతేల్చాల్సిందిగా కోరుతూ, ఆయనను కూడా నిందితుడిగా చేర్చాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ మొదలైంది. ఈ కేసును త్వరితగతిన తేల్చాలంటూ సుప్రీంనుంచి ఆళ్ల ఆదేశాలు తీసుకువచ్చిన తర్వాత.. విచారణ ప్రారంభం అయింది.
స్టీఫెన్ సన్ కు ఎమ్మెల్సీగా విధుల్లో ఓటు హక్కు భాగం కాదు గనుక.. అందుకోసం డబ్బు ఇవ్వజూపడం అనేది అవినీతి నిరోధక చట్టం కిందికి ఎలా వస్తుందో అర్థం కావడం లేదంటూ సిద్ధార్థ లేవనెత్తిన వాదన మొత్తం కేసు గమనాన్నే తారుమారు చేసేలా ఉన్నదని పలువురు భావిస్తున్నారు. అయితే విచారణ అర్థంతరంగా ఆగి, కేసు సోమవారానికి వాయిదా పడిన నేపథ్యంలో ఆరోజు మరికాస్త స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

