అందుకే బీజేపీ రూటు మార్చిందా?

తెలుగుదేశం పార్టీ నిర్ణయంతో బీజేపీ కొంత దిగి వచ్చినట్లే కన్పిస్తోంది. దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలను కలిసి తమకు మద్దతివ్వాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం ముగిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేశారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, ఏపీ విభజన హామీలను అమలు పర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమిత్ షా ఫోన్లో చెప్పారు.
గత సమావేశంలోనూ.....
ఇందుకు మార్చి 5వ తేదీన చర్చలకు రావాల్సిందిగా చంద్రబాబును అమిత్ షా ఆహ్వానించారు. అయితే మార్చి 5వ తేదీ నుంచే ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలున్నందున తాను రావడం కుదరదని, కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపీ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావులు వస్తారని చంద్రబాబు చెప్పారు. అయితే రెండు రోజుల క్రితం అమిత్ షా తో జరిగిన సమావేశం కూడా ఫలప్రదం కాలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు గుర్తు చేశారు. దాదాపు ఐదు నిమిషాలు చంద్రబాబుతో అమిత్ షా ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
చర్చలు...చర్చలే...ఆందోళనలు...ఆందోళనలే....
అయితే చంద్రబాబు తనతో అమిత్ షా ఫోన్లో మాట్లాడిన విషయాన్ని పార్లమెంటు సభ్యులకు తెలిపారు. అయితే చర్చలకు పిలిచారని ఆందోళన ఆపవద్దని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. గత నాలుగేళ్లుగా కేంద్రాన్ని విభజన హామీలను నెరవేర్చమని కోరుతూనే ఉన్నామని, అయినా పట్టించుకోలేదని, ఈసారి కూడా చర్చల పేరుతో కాలయాపన చేయడం తప్ప కేంద్రం నుంచి సాయం అందుతుందని తాము అనుకోవడం లేదని కొందరు ఎంపీలు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టాలన్న నిర్ణయంతోనే అమిత్ షా కొంత దిగి వచ్చి చంద్రబాబును చర్చలకు పిలిచినట్లు భావిస్తున్నారు.
- Tags
- బీజేపీ

