Sun Dec 28 2025 19:32:31 GMT+0000 (Coordinated Universal Time)
అంతా జనం కోసమే అని పవన్ ఫ్యాన్స్ నిరీక్షణ

జనసేన పార్టీ ని పెట్టి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజలకి సేవ చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక జనసేన పార్టీ తో కేవలం ప్రశ్నించడానికే అని చెబుతున్నాడు. ఇక జనసేన పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించిన పవన్ ఆ పార్టీ ప్రారంభోత్సవాన్ని ఒక సభ ద్వారా హైద్రాబాద్ లో తెలియ జేశాడు. తర్వాత చాలాకాలం కామ్ ఉండి పోయాడు. ఇక ఎలాగూ 2014 ఎన్నికల్లో పోటీచేస్తాడు కదా అని అనుకుంటున్న జనానికి, అభిమానులకి షాక్ ఇస్తూ బిజెపి కి, టిడిపికి మద్దతిచ్చి వారికి ప్రత్యక్షం గా సహాయం చేసాడు. మళ్ళీ కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయాడు. అయితే టిడిపి ప్రభుత్వం రాజధానికి భూసేకరణ టైం లో మళ్ళీ రైతులకి మద్దతుగా నిలబడ్డాడు. ఆ సమస్య తీరిందో లేక అలా గాలికి వదిలేశాడో గాని కామ్ గా కొన్నాళ్ళు ఉన్న పవన్...... ఈ మద్యన ప్రత్యేక హోదా విషయం తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి నేనున్నానన్నాడు. తర్వాత కొన్నాళ్ళకి కాకినాడ వేదిక గా సభ నిర్వహించగా అక్కడ అనుకోకుండా జనసేన కార్యకర్త ఒకరు చనిపోవడం తో పవన్ ఇక సభలు సమావేశాలు నిర్వహించనని ప్రకటించాడు.
అయితే సభల ద్వారా కాకుండా ప్రజల్లోకి జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్లడానికి పవన్ సోషల్ మీడియా ని వేదిక చేసుకోవాలని అనుకున్నాడు. ఇక యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ ల ద్వారా జనాలకి దగ్గరవడానికి జనసేన తో పవన్ సిద్ధమయ్యాడు. 2019 ఎన్నికల్లో ఎలాగూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ అందుకు అనుగుణం గా పావులు కదుపుతున్నాడు. అందుకే ఇప్పటినుండే ప్రచారం మొదలెట్టేశాడు. ఆ ప్రచారం లో భాగం గానే ఒక వీడియో తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు జనసేన కార్యకర్తలు. ఈ వీడియో లో జనసేన సిద్ధాంతాలు, వారు చెయ్యబోయే కార్యక్రమాల గురించి తెలియజేసారు.
మరి ఇలాంటి వీడియో లను ఎన్ని తయారు చేస్తే జనం లోకి బాగా చొచ్చుకుపోతారో గాని ఇలా సోషల్ మీడియాని ప్రచారానికి వాడుకుని పవన్ ఒక విధం గా మంచి పనే చేసాడని చెప్పొచ్చు. అసలు బహిరంగ సభల జోలికి వెళ్లకుండా జనాల్ని ఇబ్బందులు పెట్టకుండా నెమ్మదిగానైనా ఇలా ప్రచారం చెయ్యడం మంచిపనే. ఒక్క సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే సరిపోతుందా అనుకుంటే మాత్రం కష్టం. ఇక ఎలాగూ పవన్ ఒక సెలబ్రిటీ కాబట్టి సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి త్వరగానే చేరొచ్చు అని అంటున్నారు చాలామంది.
Next Story

