అంతా అయిపోయిందా...తలాక్ మాత్రమే మిగిలిందా?

అంతా అయిపోయింది... అనుకున్నట్లే జరుగుతుంది. ప్రధాని మోడీ ప్రసంగంలో ఏపీ విభజన సమస్యలు ప్రస్తావన రాలేదు. తాజాగా అరుణ్ జైట్లీ కూడా ఏపీకి అన్నీ ఇచ్చాశామన్నారు. ఇంకా ఇస్తూనే ఉంటామన్నారు. ఏపీని ఆదుకుంటామని కంటితుడుపు చర్యలే చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే ఇప్పటికే పెద్దయెత్తున నిధులను ఏపీకి ఇచ్చామన్న జైట్లీ రాజధాని నిర్మాణానికి, పోలవరానికి భారీగా నిధులు ఇచ్చామని సభలో ప్రకటించారు. విశాఖ రైల్వే జోన్, ఏపీ ఆర్థిక లోటు గురించి జైట్లీ మాట్లాడక పోవడం చూస్తుంటే కేంద్రం ఎన్ని ఒత్తిడులు తెచ్చినా దిగి వచ్చే పరిస్థితి లేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది.
జైట్లీ నుంచి కూడా స్పష్టత లేకపోవడంతో....
అరుణ్ జైట్లీ అయినా తన ప్రసంగంలో ఏపీ హామీలపై ఒక స్పష్టత ఇస్తారని అందరూ భావించారు. కాని జైట్లీ కూడా వాటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కేంద్రం ఏపీ విషయంలో ఎంత వత్తిడి తెచ్చినా ఫర్మ్ గా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లుంది. అంతేకాకుండా ఇప్పటి వరకూ ఏపీకి ఏ సంస్థలు కేటాయిచాం? ఎన్ని నిధులను ఇచ్చాం? ఏ నిధులను దేనికి కేటాయించాం? అన్న దానిపై రాష్ట్ర బీజేపీ నేతల చేత వివరణ ఇచ్చే ప్రయత్నంలో ఉంది బీజేపీ అధిష్టానం. తాము ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేయడం లేదన్న అనుమానం బీజేపీ నేతల్లోనూ ఉంది. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయిస్తే తాత్కాలిక భవనాలు నిర్మించుకుని, ఇంతవరకూ రాజధాని డిజైన్లు ఖరారు చేయకపోవడాన్ని కూడా తప్పుపడుతోంది. అలాగే పోలవరం విషయంలో మాత్రం 2019 నాటికి పూర్తి చేస్తామని గట్టిగా చెబుతుంది.
కేంద్ర సాయం చేయదని.....
దీంతో టీడీపీ నేతలకు విషయం బోధపడింది. అందుకే కొంచెం వాయిస్ ను పెంచారు. మంత్రులు, ముఖ్యనేతలందరూ బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే పొత్తును తెంచుకుంటామని తెగేసి చెప్పారు. బీజేపీ నాటకాలాడుతోందన్నారు. టీడీపీ నేత బోండా ఉమ అయితే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ పాత డిమాండ్ ను మళ్లీ తెరపైకి తెచ్చారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రాలకు ఇవ్వడం లేదని బీజేపీ మోసం చేస్తుందని ఉమ ఆరోపించారు. ఇక మంత్రి కాల్వ శ్రీనివాసులు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని తేల్చి చెప్పేశారు. మోడీ, జైట్లీ నుంచి ఎలాంటి హామీలు రాకపోవడంతో టీడీపీ ఎంపీలు భగ్గుమంటున్నారు. ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. మరి కేంద్రం దిగివస్తే సరి...లేకుంటే బీజేపీకి తలాక్ చెప్పడం ఖాయమని తెలుగు దేశం నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. దుబాయ్ లో ఉన్న చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.

