టీడీపీని 40 సీట్లకే పరిమితం చేస్తాం..కావాలంటే రాసిస్తా

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 40 సీట్లకు పరిమితం చేస్తామని, కావాలంటే రాసిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమాగా చెప్పారు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో చంద్రబాబు పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ వంటి పథకాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. నాలుగేళ్లుగా శాశ్వతం అనే పేరుతో రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పడలేదన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి బీజేపీ, జనసేననే కారణమని, వారు ముగ్గురు కలిసినా తమకంటే ఒకటిన్నర శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. స్వంత పార్టీలు ఉన్నప్పుడు స్వంతంగానే ఎన్నికలకు వెళ్లి బలం నిరూపించుకునే ధైర్యం పార్టీలకు ఉండాలన్నారు.
ఒంటరి పోరుతోనే క్లీన్ స్వీప్ చేస్తాం
రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని స్పష్టం చేశారు. తమకు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ప్రజలను నమ్ముకుని ధైర్యంగా ఎన్నికలకు పోతామని పేర్కొన్నారు. రాష్ట్రానికి మోసం చేయడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉందన్నారు. ముగ్గురు కలిసే రాష్ట్రానికి అన్యాయం చేశారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను అభిమానించే వ్యక్తులు చంద్రబాబుకి ఓటు వేశారని, ఈసారి వారిలోనూ కొందరు పవన్ కి వేస్తారని, కొందరు తమకు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పడే ఓట్లనే పవన్ చీల్చుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజన చేసి ఒక తప్పు చేస్తే, విభజన హామీలను చట్టంలో చేర్చకుండా మరో తప్పు చేసిందన్నారు. ప్రత్యేక హోదా వంటి హామీలను చట్టంలో చేర్చి ఉంటే కోర్టుకు పోయి అయినా సాధించేవాళ్లమన్నారు. బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనూ అమలు చేయకుండా, అవకాశం ఉన్నా రాష్ట్రానికి మేలు చేయకుండా మోసం చేస్తోందని రెండు పార్టీలపైనా విమర్శలు గుప్పించారు.
కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించాను...విమర్శిస్తాను...
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఎప్పటికప్పుడు కేంద్రంపై తీవ్రంగా విమర్శిస్తున్నానని, తన అసెంబ్లీ ప్రసంగాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. కేంద్రంలో రాష్ట్రానికి మేలు చేస్తుందని చంద్రబాబు అభినందిస్తున్న సమయంలో కూడా తాను కేంద్రం చేస్తున్న మోసాన్ని ఎండగట్టానని గుర్తుచేశారు. కేంద్ర వైఖరికి నిరసనగా మా చేతిలోని చివరి అస్త్రమైన ఎంపీల చేత రాజీనామాలు చేయించి కేంద్రం మొహంపై కొట్టామని అన్నారు. తమ పార్టీ వల్లె ప్రత్యేక హోదా అంశం ఇంకా ప్రజల్లో ఉందన్నారు. బీజేపీతో రాజీ ఉంటే అవిశ్వాసం ఎందుకు పెడతానని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో నరేంద్ర మోడీ పనితీరుకు సున్నా మార్కులు అన్నారు.
అవినీతి అంటూ బండలేస్తున్నారు..? నిరుపించగలరా..?
తాను మనస్సాక్షిని నమ్ముతానని, అందరూ దేవుళ్లనూ నమ్ముతానని జగన్ స్పష్టం చేశారు. నాలో ప్రతీకారం తీర్చుకోవాలనే గుణం లేదని, తాను అధికారంలోకి వస్తే చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులను మాత్రం సరిచేస్తామన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న తప్పులపై విచారణ చేయిస్తామని, కానీ ఇది ప్రతీకార చర్య కాదన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసే సమర్థుడని, అందుకే స్టేలు తెచ్చుకోగలుగుతున్నారన్నారు. తనపై లక్ష కోట్లు, లక్ష కోట్లు అని ఆరోపిస్తూ నమ్మేలా చేశారన్నారు. అవి నిరూపించగలరా అని ప్రశ్నించారు. తనపై అవినీతి చేశానని ఆరోపణలు చేశేవారు వారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని అన్నారు. తన తండ్రి అధికారంలో ఉన్నప్పడు ఏరోజు సెక్రటేరియెట్ కి వెళ్లలేదని, అసలు హైదరాబాద్ లోనే లేనని అన్నారు. కేవలం తనపై బండ లేస్తున్నారని అన్నారు. తాను అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలన తీసుకువస్తానని అన్నారు. పార్టీ కోసం ఎనిమిది ఏళ్లుగా రోడ్డుపైనే ఉంటున్నానని, ఏ పార్టీ అయినా అధినేత విశ్వసనీయతపైనే నడుస్తుందన్నారు. తాను ఏకపక్ష నిర్ణయాలు తీసుకోనని, పార్టీలో అందరి సలహాలు కచ్చితంగా తీసుకుంటాన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే సమయంలో భవిష్యత్ లో ఈస్థాయికి వస్తానని కూడా ఊహించలేదని అన్నారు. దేవుడు ఆశీర్వదించి...ప్రజలు దీవిస్తే 2019లోనే అధికారంలోకి వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

