బాబు బుజ్జగించినా సరే వైసీపీలోకే

చంద్రబాబు బుజ్జగించినా ససేమిరా అన్నారు. భవిష్యత్ ఉంటుందని తెలిపినా ఆయన వైసీపీలో చేరేందుకే మొగ్గుచూపుతున్నారు. వైసీపీలో చేరేందుకే బెజవాడ నేత యలమంచలి రవి మొగ్గు చూపుతున్నారు. యలమంచలి రవి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు గుంటూరుజిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసిన ఆయన అరగంట సేపు చర్చలు జరిపారు. జగన్ ఇచ్చిన హామీతో యలమంచలి రవి సంతృప్తి చెందారని తెలుస్తోంది.
జగన్ తో భేటీ అయి.....
యలమంచలి రవి పెనమలూరు నియోజకవర్గ టీడీపీ నేత. వచ్చే ఎన్నికల్లోనూ తనకు టిక్కెట్ ఇవ్వరని గ్రహించిన యలమంచలి రవి వైసీపీలో చేరేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆయన తన అనుచరులతో సమావేశమై తన భవిష్యత్ రాజకీయాలపై చర్చించారు. యలమంచలి రవితో కొడాలినాని, వంగవీటి రాధాలు సయితం గతంలో మాట్లాడి వైసీపీలో చేరాల్సిందిగా కోరారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయడంతో ఈ విషయాన్ని జగన్ కు చేరవేశారు.
కేశినేని రాయబారం.....
అయితే యలమంచలి రవి వైసీపీలో చేరతారన్న ప్రచారం జరగడంతో విజయవాడ ఎంపీ కేశినేని యలమంచలి రవిని టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. చంద్రబాబుతో భేటీ అయిన రవి పార్టీ మారే నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటారని అందరూ భావించారు. కాని చంద్రబాబు యలమంచలి రవికి ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో ఒక పదవి ఇస్తానని ఇచ్చిన హామీని ఆయన నమ్మలేదు.
పాదయాత్ర మొదటి రోజే.....
దీంతో కొద్దిసేపటి క్రితం జగన్ ను యలమంచలి రవి కలిశారు. తన భవిష్యత్ రాజకీయాలపై జగన్ తో చర్చించారు. ఈ సందర్బంగా అరగంట సేపు మాట్లాడిన జగన్ యలమంచలికి పూర్తి స్థాయి భరోసాఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రవి వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ త్వరలోనే కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ఆయన పాదయాత్ర మొదటిరోజే రవి పార్టీలో చేరతారని తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబు బుజ్జగింపులు పనిచేయలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది.
