Wed Jan 28 2026 23:50:45 GMT+0000 (Coordinated Universal Time)
మారాను... మరింత మారతానంటున్న యరపతినేని
యరపతినేని శ్రీనివాసరావు రెండు సార్లు గురజాల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు.

"నేను మారాను.. మారింత మారతా.. క్షమించమని వేడుకుంటున్నా... శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నా. తప్పు చేసి ఉంటే క్షమించండి. వచ్చే ఎన్నికల్లో గురజాలతో సహా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించండి. మన మధ్య ఉన్న విబేదాలను పక్కన పెట్టండి. ప్రతి గ్రామం తిరిగి ప్రతి ఒక్కరిని కలుస్తానంటూ" టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
రెండుసార్లు గెలిచి....
యరపతినేని శ్రీనివాసరావు రెండు సార్లు గురజాల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. గత ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం మిస్ అయింది. వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి చేతిలో దాదాపు ముప్ఫయి వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయనపై మైనింగ్ విషయంలో సీబీఐ కేసు కూడా నమోదయింది. నియోజకవర్గంలో తనకు తిరుగు లేదనుకున్న యరపతినేని శ్రీనివాసరావుకు గత ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది.
దూరమయిన వర్గాలను....
రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఎదురుగాలులు తన ఓటమికి కారణమని ఆయన భావిచడం లేదు. తనపై తీవ్ర వ్యతిరేకత ఉందని, తన చుట్టూ ఉన్న వారితోనే ఆయనకు గత ఎన్నికల్లో సమస్యలు ఎదురయ్యాయని భావిస్తున్నారు. అందుకే క్షమాపణలు కోరుతున్నారు. గతంలో చేసిన తప్పులు తాను రిపీట్ చేయనని చెబుతున్నారు. అందరిని కలుపుకుని వెళతానని, వచ్చే ఎన్నికల్లో తనను ఆదరించాలని యరపతినేని శ్రీనివాసరావు కోరుతుండటం విశేషం.
కొంత ఊరట...
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ యరపతినేని శ్రీనివాసరావు తన పట్టును నిరూపించుకున్నారు. ఆ జోష్ తోనే ఆయన నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నారు. తనకు దూరమైన వారిని తిరిగి తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానమైన వర్గం ఆయనకు దూరమవ్వడంతోనే ఓటమి ఎదురయిందని భావించిన యరపతినేని శ్రీనివాసరావు తాను మారానని, మరింత మారతానంటూ వేడుకుంటున్నారు. వంగి నమస్కరించారు మరి యరపతినేని వేడుకోలు ఏ మేరకు ఫలిస్తుందన్నది చూడాలి.
Next Story

