బాబు సర్కార్ కు జగన్ వార్నింగ్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. తాము పిలుపునిచ్చిన బంద్ ను ఎందుకు ప్రభుత్వం అడ్డుకుంటుందని జగన్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను అడ్డుకోవడానికే తెలుగుదేశం ప్రభుత్వం బంద్ ను విఫలం చేసే యత్నం చేస్తుందన్నారు. బంద్ కు అన్ని వర్గాలు మద్దతిచ్చాయని, ప్రశాంతంగా బంద్ జరుగుతున్నప్పటికీ పోలీసులు ఎక్కడికక్కడ వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం అమానుషంగా జగన్ అభివర్ణించారు. ప్రభుత్వం చర్యలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతున్న బంద్ కు మద్దతివ్వాలని జగన్ కోరారు.
ముందస్తు అరెస్టులతో.....
కాగా మంగళవారం ప్రారంభమైన బంద్ ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం నుంచే ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. కాగా వైసీపీ నేతలను పలువురిని పోలీసులు గృహనిర్భంధం చేశారు. వైసీపీ నేత అంబటి రాంబాబును ఆయన ఇంటివద్ద అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ స్టేషన్లకు తిప్పుతున్నారని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత అంబటి రాంబాబును సత్తెనపల్లిలో అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత ముప్పాళ్ల స్టేషన్ కు తీసుకెళ్లారని, అక్కడి నుంచి రాజుపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అనంతపురంలో వైసీపీ కార్యకర్తలు ర్యాలీ తీస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
అర్థంలేని బంద్ అంటున్న.......
కాగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం వైసీపీ పై విరుచుకుపడింది. జగన్ పార్టీ ఇచ్చిన బంద్ అర్థం లేనిదని కొట్టిపారేసింది. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాటం చేయకుండా రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. బంద్ వల్ల ఏపీ నష్టపోతుందని తెలిసి కూడా జగన్ కేంద్రంపై పోరాటం చేయకుండా, రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

