సూరీడు ప్రభావం జగన్ పై పడలేదే...?

మంటుటెండ....వడగాల్పులు...అయినా లెక్క చేయకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ప్రజాసంకల్ప పాదయాత్రను కొనసాగిస్తున్నారు. గత పది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో వడగాల్పులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సయితం 40 నుంచి 43 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎర్రటి ఎండలోనూ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అదే ఎండలో జగన్ ను చూసేందుకు ప్రజలు కూడా బారులు తీరి నిల్చుండటం విశేషం.
షెడ్యూల్ లో స్వల్ప మార్పులు.....
జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతుంది. ఆయన భీమవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వడగాల్పులు అధికం కావడం, ఎండలు మండిపోతుండటంతో జగన్ తన పాదయాత్ర షెడ్యూల్ ను కొద్దిగా మార్చుకున్నారు. ఉదయం ఏడుగంటలకే ఆయన పాదయాత్రను ప్రారంభించి 12గంటలకు ముగిస్తున్నారు. భోజన విరామానికి ఆగుతున్నారు. తర్వాత తిరిగి 2.30 గంటల ప్రాంతంలో పాదయాత్రను ప్రారంభిస్తున్నారు.
మరో కొద్దిపాటి లక్ష్యమే.......
జగన్ ఇప్పటి వరకూ సుమారు 2,200 కిలోమీటర్ల పాదయాత్ర ను పూర్తి చేశారు. అంతిమ లక్ష్యం చేరుకోవడానికి మరో 800 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో జగన్ పాదయాత్ర వెంట ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. నిరంతరం జగన్ కు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంత ఎండలోనూ జగన్ తో సెల్ఫీలు దిగడానికి యువత పోటీ పడుతోంది. దీంతో కిలోమీటరు దూరం పాదయాత్ర చేయడానికి గంటకు పైగానే సమయం పడుతుంది. సాయంత్రం సమయానికి బహిరంగ సభలు పెడుతున్నారు.
సదస్సులు పెట్టేందుకు కూడా.....
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మీయ సదస్సులు నిర్వహించడం లేదు. జగన్ పాదయాత్ర ప్రారంభమై దాదాపు ఏడు నెలలు గడుస్తోంది. ఇప్పటికి ఏడు జిల్లాలు పూర్తి చేసుకున్నారు. ఏడు జిల్లాల్లోనూ ఆత్మీయ సదస్సులను జగన్ నిర్వహించారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, రైతు సదస్సుల వంటివి జగన్ పాదయాత్రలో కన్పించేవి. కాని పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చే సరికి నిర్వాహకులు ఆత్మీయ సదస్సులు నిర్వహించకూడదని నిర్ణయించినట్లుంది. ఇందుకు కారణం కూడా ఎండవేడిమేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద జగన్ పాదయాత్ర నడి నెత్తిన సూరీడు ప్రతాపం చూపుతున్నా జగన్ మాత్రం మొండిగా ముందుకు సాగుతున్నారన్న వ్యాఖ్యలు పార్టీలో విన్పిస్తున్నాయి.
- Tags
- andhra pradesh
- ap politics
- bheemvaram
- janasena party
- nara chandrababu naidu
- padayathra
- pavan kalyan
- telugudesam party
- west godavari district
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబు నాయుడు
- పవన్ కల్యాణ్
- పశ్చిమగోదావరి జిల్లా
- పాదయాత్ర
- భీమవరం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
