మాది ఫెవికాల్ బంధమే...!

ఫెవికాల్ బంధంలాంటి వైఎస్సాఆర్, జక్కంపూడి కుటుంబాలకు నడుమ పాదయాత్రలో గ్యాప్ వచ్చిందన్న ప్రచారానికి తెరపడింది. తాజాగా కొత్తపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు కుమారుడు వైసిపి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు రాజా జగన్ తో పాదయాత్రలో పాల్గొన్నారు. అంతే కాకుండా భారీ ఎత్తున జరిగిన రావులపాలెం సభలో జగన్ చెంతనే నిలిచారు. తూర్పుగోదావరి జిల్లాకు జగన్ విచ్చేస్తున్న సందర్భంలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జక్కంపూడి కుటుంబం భారీ ఏర్పాట్లే చేసింది. వైఎస్ కుటుంబంతో దశాబ్దాలుగా వున్న బంధం కావడంతో తమ నేతకు కనివిని ఎరుగని రీతిలో వారు ప్రత్యేక దృట్టి పెట్టారు. అయితే జగన్ రాజమండ్రి సభలో జక్కంపూడి ప్రస్తావన చేయకపోవడం, పాదయాత్రలో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రాజా అలిగి పర్యటన నుంచి వెళ్ళిపోయారని పదవులకు సైతం రాజీనామాలు చేసి వైసిపిలోనే కొనసాగుతామని స్పష్టం చేసినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది.
పుట్టినరోజు వల్లనే...?
కట్ చేస్తే జక్కంపూడి రాజా కొత్తపేట నియోజకవర్గం పర్యటనలో జగన్ వెంట నడవడం రావులపాలెం సభలో పాల్గొనడంతో తెలుగుపోస్టు ఈ వివాదంపై ఆయన్ను వివరణ కోరింది. తమ తండ్రి ఇచ్చిన ఆస్తి వైఎస్సార్ కుటుంబమని రాజా వ్యాఖ్యానించారు. తమ అధినేతపైనే అలగడం ఏమిటని ప్రశ్నించారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ కుటుంబం జగన్ వెంటే ఉంటామన్నారు రాజా. వాస్తవానికి రాజమండ్రి సభ తరువాత తాను పర్యటన నుంచి వెళ్ళిపోవడానికి కారణం తన కుమార్తె పుట్టినరోజు ఉండటమే అని గత 15 రోజులుగా పర్యటన విజయవంతానికి నిద్రాహారాలు మానడంతో అలసి విశ్రాంతి తీసుకుని తిరిగి జాయిన్ అయినట్లు తెలిపారు రాజా. తమ అధినేతకు చెప్పే పాదయాత్ర నుంచి వెళ్ళానని దీనిపై మీడియా రకరకాలుగా ప్రచారం చేసింది తప్ప మరేమి లేదని తేల్చేశారు జక్కంపూడి రాజా.
