జగన్ ను కలిస్తే ఇక అంతేనా?

ప్రతిపక్ష నేత జగన్ ను ఎవరైనా కలవొచ్చు. ప్రభుత్వం నుంచి స్పందన రానప్పుడు సహజంగా ఎవరైనా ప్రతిపక్ష నేతనే కలుస్తుంటారు. గతంలో చంద్రబాబు పదేళ్ల పాటు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఎందరో కలిశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని విన్నవించుకున్నారు. సహజంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సర్కార్ పై వత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్ష నేతను కలుస్తుంటారు.
ఎదురుదాడికి దిగుతూ.....
కాని తిరుమల, తిరుపతి దేవస్థానం పూర్వపు ప్రధాన అర్చకులు రమణదీక్షితులు వైసీపీ అధినేత జగన్ ను కలవడాన్ని అధికార పార్టీ రచ్చ రచ్చ చేస్తుంది. ఇది కూడా బీజేపీ మహాకుట్రలో భాగమేనంటూ రమణదీక్షితులు, జగన్ భేటీపై ఎదురు దాడికి దిగుతోంది. వైఎస్ జగన్ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో ఆయన గురువారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. జగన్ పాదయాత్రకు రేపు విరామమిచ్చారు.
20 నిమిషాలు భేటీ.....
దీంతో ప్రతిపక్ష నేత అపాయింట్ మెంట్ తీసుకున్న రమణ దీక్షితులు నేరుగా హైదరాబాద్ లోని జగన్ నివాసమైన లోటస్ పాండ్ కు వచ్చి ఆయనను కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు. ఈ చర్చల సారాంశం బయటకు రాకపోయినప్పటికీ తనకు జరిగిన, జరుగుతున్న అన్యాయం గురించే రమణ దీక్షితులు జగన్ కు వివరించి ఉంటారన్నది వాస్తవం. ఆయన గత కొద్ది రోజులుగా టీటీడీలో జరుగుతున్న అవకతవకలపై ఆరోపణలు చేస్తున్నారు. తిరుమలలో తవ్వకాలు జరిగాయని, గులాబీ రంగు వజ్రం మాయమైందని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు.
రాద్ధాంతం అవసరమా?
కాని రమణదీక్షితుల ఆరోపణలకు సమాధానమివ్వని ప్రభుత్వం ఆయన ప్రతిపక్ష నేతను కలిస్తే రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ మహాకుట్రలో భాగంగానే రమణదీక్షితులు జగన్ ను కలిశారని, ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయిన తర్వాతనే ఆరోపణలు చేశారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే రమణదీక్షితులు రాజకీయ నాయకులతో భేటీ అవుతున్నారంటున్నారు. కాని రమణ దీక్షితులు మాత్రం తాను ఎవరినైనా కలుస్తానంటున్నారు. తమ సమస్యలను చెప్పుకునేందుకే అందరినీ కలుస్తున్నానని చెబుతున్నారు. వంశ పారపర్యంగా వస్తున్న తమను స్వామివారికి కైంకర్యం చేసుకోకుండా నిబంధనల పేరుతో అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. మొత్తం మీద జగన్ ను రమణ దీక్షితులు కలవడాన్ని టీడీపీ కుట్ర రాజకీయంగా పేర్కొంటోంది.
- Tags
- hyderabad
- lotus pond
- nara chandrababu nadiu
- ramana deekshitulu
- telugu desam party
- tirumala thirupathi devasthanams
- y.s. jaganmohan reddy
- ysr congress party
- తిరుమల తిరుపతి దేవస్థానములు
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- రమణ దీక్షితులు
- లోటస్ పాండ్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- హైదరాబాద్
