Sat Dec 06 2025 00:40:15 GMT+0000 (Coordinated Universal Time)
సజ్జల అపాయింట్మెంట్ దొరకడం లేదా?
ఇటీవల జగన్ ఇచ్చిన వార్నింగ్ తో ఎమ్మెల్యేలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు క్యూ కడుతున్నారు

జగన్ తర్వాత ఎవరు అంటే వైసీపీలో ఎవరైనా టక్కున సమాధానం చెప్పేది సజ్జల రామకృష్ణారెడ్డి పేరు. అంతా తానే అయి జగన్ కు నాలుకలా సజ్జల వ్యవహరిస్తున్నారనడం కాదనలేని వాస్తవం. ఇటీవల జగన్ ఇచ్చిన వార్నింగ్ తో ఎమ్మెల్యేలు సజ్జల వద్దకు క్యూ కడుతున్నారట. మంత్రి పదవులు దెవుడెరుగు. ముందు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ వస్తే చాలంటూ సజ్జల వద్ద మొరపెట్టుకుంటున్నట్లు తెలిసింది.
ప్రజలకు దూరమైన...
ఇటీవల పనిచేయని, ప్రజలకు చేరువ కాని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఉండదని జగన్ ఖచ్చితంగా చెప్పేశారు. సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని కూడా జగన్ కుండబద్దలు కొట్టేశారు. దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో సిట్టింగ్ లను మారుస్తారన్న చర్చ పార్టీలో జరుగుతుంది. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంతో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. కరోనా సాకు దొరకడంతో రెండేళ్ల నుంచి వారు నియోజకర్గాలకు పెద్దగా వెళ్లడం లేదు.
వ్యాపారాలకే....
చాలా మంది ఎమ్మెల్యేలు బెంగళూరు, హైదరాబాద్ లో వ్యాపారాలకే పరిమితమయ్యారని వైసీపీ హైకమాండ్ కు నివేదికలు అందాయి. అందువల్లనే జగన్ ఆ వ్యాఖ్యలు చేశారంటున్నారు. ప్రకాశం, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలపై ఎక్కువగా ఫిర్యాదులు అందినట్లు విశ్వసనీయ సమాచారం. వీళ్లంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావడంతో వచ్చే ఎన్నికల్లో జగన్ వ్యాఖ్యలతో టిక్కెట్ వస్తుందా? రాదా? అన్న డౌటు మొదలయింది.
15 మంది ఎమ్మెల్యేలు....
దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. వీరంతా తమకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసమే కలసినట్లు చెబుతున్నారు. ఇక నుంచి నియోజవకర్గంలోనే ఉంటామని, జగన్ ను కన్వెన్స్ చేయాలని వీరు సజ్జల రామకృష్ణారెడ్డిని కోరినట్లు తెలిసింది. సజ్జల సంతకం ఉంటే తమకు వచ్చే ఎన్నికల్లో సీటు గ్యారంటీ అని చాలా మంది ఎమ్మెల్యేలు నమ్ముతున్నారు. అందుకోసమే సజ్జల అపాయింట్ మెంట్ కోసం ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు.
Next Story

