అంతా ఉత్తిదేనా ...?

తెలంగాణ లో సినీ ప్రేక్షకులకు ఇక మంచి రోజులు వస్తాయనే ఆశించారు. తూనికలు కొలతల శాఖ సినిమా ధియేటర్ల లో తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తే తాట తీస్తామన్న ప్రకటనలు అందరిలో ఆనందాన్ని నింపాయి. ఆగస్టు 1 నుంచి దాడులు చేస్తామని ఆ శాఖ హెచ్చరికలు ఒక మంచి మార్పునకు శ్రీకారం చుడతాయని అంతా భావించారు. తీరా సీన్ కట్ చేస్తే తూనికలు శాఖకు అంత సీన్ లేదన్నట్లు ధియేటర్ యాజమాన్యాల వ్యవహారం సాగడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అరకొరగా దాడులు కేసులు ఈ వ్యవహారం ప్రచార ఆర్భాటానికే పరిమితం అన్నట్లు తేలింది.
ఎవరు లెక్కే చేయడం లేదు ...
హైదరాబాద్ లోని మల్టి ఫ్లెక్స్ లు, బడా మాల్స్ లో తినుబండారాల ధరలు బహిరంగ మార్కెట్ తో పోలిస్తే అతి దారుణమైన రేట్లకు విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీకి మించి వీటిని విక్రయించకపోయినా, నాణ్యత ప్రమాణాలను పాటించకపోయినా కఠిన చర్యలు తప్పవంటూ తూనికలు కొలతల శాఖ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆగస్టు 1 నుంచి విక్రయించే తినుబండారాల బోర్డు లు విధిగా ఉంచాలని అలాగే వాటిని నాణ్యంగా కొలత ప్రకారం అందించాలని పేర్కొంది. అలా చేయని యాజమాన్యాలపై భారీ జరిమానాలు విధించాలని, రెండో సారి తప్పు చేస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. అకున్ సబర్వాల్ ఈ హెచ్చరికలు చేయడంతో ఇక సినిమా చూస్తూ తక్కవ ధరలకు తినుబండారాలను కొనుగోలు చేయవచ్చనుకున్నారు.
తూ..తూ మంత్రంగానే.....
ఇంకేముంది భారీ మార్పులు తప్పవని అనధికార గుండాయిజం టాక్స్ కు ఇక చెక్ పడుతుందనే అంతా భావించినా ధియేటర్ యజమానులు, మాల్స్, మల్టి ఫ్లెక్స్ యాజమాన్యాలు ఈ అంశానికి అసలు ప్రాధాన్యత ఇచ్చిందే లేకపోవడం గమనార్హం. దాంతో తూనికలు కొలతల అధికారులు 14 బృందాలుగా ఏర్పాడి 20 కేసులు నమోదు చేశారు. చాలా చోట్ల తనిఖీ బృందాలను యాజమాన్యం అనుమతించకపోవడం విశేషం. తూతూ మంత్రంగానే ఈ వ్యవహారం సాగడంతో అధికారుల ఆర్భాటం నవ్వుల పాలైంది.
