ఈసారైనా ఇలా చెయ్యి బాబూ అంటున్న ఉండవల్లి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ టర్మ్ లో చివరివి. కనుక రాష్ట్ర విభజన అడ్డగోలు అనడం ధర్మ పోరాటం మాని లోక్ సభలో నాటి విభజన పై చర్చకు నోటిస్ ఇవ్వాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ రాశారు. కనీసం స్వల్ప వ్యవధి ప్రశ్న అయినా వేయాలని ఆయన కోరారు. తలుపులు మూసేసి అన్యాయంగా విభజన చేశారని సాక్షాత్తు ప్రధానమంత్రి లోక్ సభలో అడ్మిట్ అయ్యాకా చూస్తూ ఉరుకుంటే ఎలా అని ఉండవల్లి నిలదీశారు. అవిశ్వాసం ఎలాగూ పక్కన పెట్టేశారని కనీసం ఉన్న అవకాశం అయినా వినియోగించుకోవాలని ఉండవల్లి సూచించారు. అన్యాయం జరిగిన బాధితులు ఫిర్యాదు చేయకపోతే ఈ రాష్ట్రానికి ఎవరు న్యాయం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు అరుణ కుమార్.
డివిజన్ జరక్కుండా తలుపులు ఎందుకు మూశారు ...?
గత పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్ వ్యవహరించిన అప్రజాస్వామిక ధోరణి సిగ్గుచేటని, దీనిని కోర్ట్ లో డివిజన్ కాకుండా తలుపులు ఎందుకు ముశారో లోక్ సభలోనే తేల్చాలని ఉండవల్లి చంద్రబాబుకి లేఖలో సూచించారు. తన దగ్గర ఉన్న సమాచారం అంతా చర్చ జరిగితే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అని మరోసారి ఆయన చెప్పారు. ప్రధానమంత్రి స్వయంగా ఏపీకి అన్యాయం చేశారరని అన్నప్పుడు దానిపై చర్చకు నోటీస్ ఇవ్వకపోతే మనకు మనమే ద్రోహం చేసుకున్నట్లే అన్నారు అరుణ కుమార్. చర్చకు కేంద్రం అంగీకరించని పక్షంలో కనీసం ప్రశ్న అయినా అడగొచ్చన్నారు. వీటికి కూడా అనుమతి నిరాకరిస్తే ప్రధానిని అవమానించినట్లేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. డివిజన్ అని ప్రకటించాక మూడు నిమిషాలు సమయం ఇస్తారని స్పీకర్ లాంగ్ బెల్ కొట్టి సభ్యులందరూ లోపలికి వచ్చేలా ప్రకటిస్తారని ఆ తరువాత ఇన్నర్ లాబీ ఖాళీ చేయించి తలుపులు మూసి లెక్కిస్తారని కానీ ఇవేవి జరక్కుండానే తలుపులేసి తలలు కూడా కౌంట్ చేయకుండా విభజన చేసి పారేశారన్నారు అరుణ కుమార్. ఇన్నాళ్లూ కంఠ శోష అనుకున్నా కానీ ప్రధాని కూడా నేను చెప్పిందే లోక్ సభలో చెప్పారని గుర్తు చేశారు .
రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం లో దావా వెయ్యాలి ...
మనమీద బలవంతంగా అఘాయిత్యం చేశారు. దీనిని ప్రశ్నించి ఫిర్యాదు చేయకపోతే ప్రజాస్వామ్యానికి అర్ధం ఏమిటని అరుణ్ నిలదీశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 131 కింద సుప్రీం కోర్ట్ లో కేసు దాఖలు చేయొచ్చని ఉండవల్లి అన్నారు. రాష్ట్రాలకు రాష్ట్రాలకు నడుమ, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య తగాదా వచ్చినప్పుడు అన్యాయం జరిగిందనుకున్నప్పుడు సుప్రీం కోర్ట్ కి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం కోర్ట్ ట్రయల్ కోర్ట్ గా వుండే నేపథ్యంలో లోక్ సభ ప్రొసీడింగ్స్ పై కోర్ట్ లో చర్చకు అవకాశం లేనప్పుడు వున్న ఈ ఛాన్స్ అయినా మిస్ చేయొద్దన్నారు అరుణ కుమార్.
అద్వానీ నోరు విప్పుతారు ...
విభజన బిల్లు సమయంలో అద్వానీ జరుగుతున్న ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన లోక్ సభలో చర్చ జరిగితే తన గొంతు విప్పుతారన్నారు ఉండవల్లి. అద్వానీ పై జైపాల్ రెడ్డి పార్లమెంట్ లో ఆన్ రికార్డ్ చేసిన వ్యాఖ్యలే దీనికి ఉదాహరణ అంటూ గుర్తు చేశారు. లోక్ సభకు ఒక రూల్ రాజ్యసభకు మరో రూల్ ఉండవని ఈ విషయాన్నీ ఎత్తి చూపి నిలదీయాలన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి వచ్చేసినందున టీడీపీ ఎంపీలు ఈ ఛాన్స్ మిస్ చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజమైన పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. చర్చ అంటూ జరిగితే గత లోక్ సభలో విభజన బిల్లుపై ఏమి జరిగింది అన్న అంశంపై కాంగ్రెస్ బిజెపి లు చొక్కాలు విప్పేసుకుని నిజాలు చెప్పే అవకాశం ఉందన్నారు ఉండవల్లి. అందువల్ల చంద్రబాబు నాయుడు మేల్కొని రాష్ట్రంలో అందరూ ఒకే మాట మీద ఉన్న అంశాలపై ఇక్కడ పోరాటం ఆపి పార్లమెంట్ వేదికగా అడ్డగోలు విభజన పై చర్చ జరపాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా అన్నారు అరుణ కుమార్.

