Fri Dec 05 2025 11:19:36 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పదవికి విజయమ్మ రాజీనామా
విమర్శలకు తావివ్వకుండా ఈ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవిలో ఉండలేనని విజయమ్మ చెప్పారు

రాజశేఖర్ రెడ్డి అందరి వాడని వైఎస్ విజయమ్మ అన్నారు. అందరినీ అభినందించడానికి, ఆశీర్వదించడానికి తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఏపీలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. అందరి హృదయాల్లో రాజశేఖర్ రెడ్డి సజీవంగా నిలిచి ఉన్నారన్నారు. పార్టీ అంటేనే ప్రజల అభిమానమన్నారు. ఈరోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నామంటే మూడేళ్ల పాలన సంతృప్తి కరంగా సాగినందుకేనని విజయమ్మ చెప్పారు. జగన్ మాస్ లీడర్ అని చెప్పారు.
మూడేళ్లలో...
మూడేళ్లలో 90 శాతం మేనిఫేస్టో ను అమలు చేసిన ఏకైక పార్టీ వైసీపీ అని ఆమె చెప్పారు. జగన్ చెప్పినవి, చెప్పనవి కూడా జగన్ చేసి చూపించారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను పేద ప్రజలకు చేర్చారన్నారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. మానవత్వం, మనసుతో చేసే పరిపాలన అని విజయమ్మ అన్నారు. తండ్రి ఆశాయాలను జగన్ తప్పక నెరవేరుస్తాడని విజయమ్మ అన్నారు. ప్రజల అభిమానం నుంచే వైసీపీ పుట్టిందన్నారు. మీతో అనుబంధం 45 ఏళ్ల నాటిదని కార్యకర్తలనుద్దేశించి అన్నారు. షర్మిలమ్మ పాదయాత్ర చేసి అన్నకు వెన్నుదన్నుగా నిలబడిందన్నారు.
బాబు పథకం..?
రాజశేఖర్ రెడ్డి సమకాలీకుడు చంద్రబాబు అమలు చేసిన ఏ ఒక్క పథకం అయినా ఉందా? అని విజయమ్మ ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కూడా చంద్రబాబు పక్కన పెట్టారు. చంద్రబాబు జనంలో నుంచి వచ్చిన నేత కాదన్నారు. జగన్ అనేక కష్టాలు ఎదుర్కొని జనం నుంచి వచ్చారన్నారు. ఓటు అడిగే నైతిక హక్కు కలిగిన నేత జగన్ అని అన్నారు. జగన్ పై అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారని విజయమ్మ అన్నారు. మా కుటుంబం ఎన్ని నిందలు పడ్డా నిలదొక్కుకున్నామని చెప్పారు. గతంలో మాదిరిగా తన బిడ్డను మరోసారి ఆశీర్వదించాలని విజయమ్మ పిలుపునిచ్చారు.
మా అనుబంధం...
తమ కుటుంబం అభిమానం కలది. మా అనుబంధం గొప్పది. తన అన్నకు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే తెలంగాణలో వైఎస్సార్టీపీ ఏర్పాటు చేసిందన్నారు. ఈరోజు షర్మిలమ్మకు అండగా ఉండాల్సిన బాధ్యత తనకుందన్నారు. రెండు చోట్ల సభ్యత్వం ఉండొచ్చా అని ఎల్లో మీడియాలో ప్రచారం చేశారన్నారు. తల్లిగా ఇద్దరి భవిష్యత్ బాగుండాలనే కోరుకుంటానని చెప్పారు. తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వస్తాయి కాబట్టి అక్కడ షర్మిలకు అండగా నిలబడాల్సి ఉంటుందన్నారు.
అందుకే రాజీనామా...
ఇద్దరూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వేర్వేరు భావాలు ఉండాల్సి వస్తుందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వక్రీకరణలకు తావు లేకుండా ఉండక తప్పదన్నారు. జగన్ తిరుగులేని మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రిగా గెలుస్తాడన్న నమ్మకం ఉంది. ఈ పరిస్థితుల్లో విమర్శలకు తావివ్వకుండా ఈ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవిలో ఉండలేనని విజయమ్మ చెప్పారు. ఈ పార్టీ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు. షర్మిల ఒంటరిపోరాటం చేస్తున్నారు కాబట్టి ఆమెకు అండగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన ఉనికి ఎవరికీ అభ్యంతరం కాకుండా ఉండేందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
Next Story

