వర్ల ఇంకా బయటపడలేదే

ఆ మధ్య ఎపి ఆర్టీసీ ఛైర్మన్ వర్లరామయ్య బస్సు లో ప్రయాణిస్తున్న విద్యార్థితో అనుచిత వ్యాఖ్యలు రేపిన దుమారం ఇప్పట్లో చల్లారేలా లేవు. మాదిగ కులాన్ని తక్కువ చేసి మాట్లాడటం, విద్యార్థి తండ్రిపైన చేసిన వ్యాఖ్యలపై ఆ కుర్రోడి తల్లితండ్రులు పోరాటం మొదలు పెట్టారు. మీకు ఓట్లు కావలిసినప్పుడు మాల,మాదిగల అవసరం ఉందని వారు విమర్శించారు. రామయ్య వ్యాఖ్యలతో తమ కుమారుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడన్నారు. తమ కుటుంబం మానసికంగా వేదనకు గురయ్యిందని చెప్పారు. విద్యార్థి తల్లి అయితే వర్లరామయ్యకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తమ కుమారుడిని ప్రయోజకుడిని చేయాలిసిన బాధ్యత రామయ్య చేపట్టాలని డిమాండ్ చేసింది. అలా చేయని పక్షంలో పోరాటానికి దిగతామని హెచ్చరించింది.
మరోసారి క్షమించమన్న రామయ్య ...
ఆ సంఘటనపై రామయ్య మరోసారి క్షమించమన్నారు. తన ఉద్దేశ్యం విద్యార్థి బాగా చదువుకుని ప్రయోజకుడు కావాలని చెప్పుకొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఉందని అలా మాట్లాడాలిసింది కాదని అన్నారు. ఈ సంఘటనపై రచ్చ ఇక అనవసరమని కూడా మీడియాకు సూచించారు. కులం కోసం మాట్లాడింది తప్పేనని అంగీకరించి తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇప్పటికీ ఈ అంశం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తూనే ఉండటం విశేషం.
